
మోదీ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న కేంద్ర మంత్రులు జవదేకర్, సుష్మా స్వరాజ్
న్యూఢిల్లీ: రానున్నది పరీక్షల సీజన్. విద్యార్థులతోపాటు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఒత్తిడిని పెంచే సమయమిది. ఇలాంటి సమయంలో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకుని విజయతీరాలకు చేరటంపై విద్యార్థులకు ప్రధాని మోదీ కిటుకులు అందించారు. వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసేందుకు తన అనుభవాలతో 25 అధ్యాయాలు (మంత్రాలు, యోగాసనాలతో) పుస్తకాన్ని రాశారు.
ఎగ్జామ్ వారియర్స్ (పరీక్షా యోధులు) పేరుతో రాసిన ఈ పుస్తకాన్ని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, మానవ వనరుల మంత్రి ప్రకాశ్ జవదేకర్ శనివారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ పుస్తకం రాయటం ద్వారా.. ఇంతవరకు ఏ దేశాధ్యక్షుడు గానీ.. ప్రధాని గానీ సాధించని అరుదైన ఘనతను మోదీ తన ఖాతాలో వేసుకున్నారు. భారత యువతకు అంకితమిచ్చిన ఈ పుస్తకాన్ని ‘ది ఐడియా’ అనే నరేంద్రమోదీ మొబైల్ యాప్‌తో అనుసంధానించారు.
‘ఈ యాప్ ద్వారా పరీక్షలను ఎదుర్కోవడంలో తమ అనుభవాలు ఇతరులతో పంచుకుని, వారెలా ఒత్తిళ్లను అధిగమించారో తెలుసుకోవచ్చు. పిల్లల నుంచి ఏదో ఆశించడం (మార్కుల రూపంలో) కంటే వచ్చే ఫలితాన్ని అంగీకరించాలని తల్లిదండ్రులను కోరారు. ‘విద్యార్ధుల సొంత ఆలోచనలు, ఆసక్తులకు అనుగుణంగా వారిని ప్రోత్సహించాలి. వారి అభిరుచులకు అనుగుణంగా దృఢచిత్తంతో ముందుకు సాగేలా వెన్నుతట్టాలి’ అని ఉపాధ్యాయులకు సూచించారు.
పరీక్షంటే పండగే:
‘పరీక్షలు పండగల వంటివి. వాటిని ఘనంగా నిర్వహించండి’ ఇది ఎగ్జామ్ వారియర్స్ పుస్తకంలోని తొలి అధ్యాయం శీర్షిక. కాపీ కొట్టడం వంటి తప్పుడు పద్ధతులకు పాల్పడితే అందరిలో పలుచనై పోతారు. ఇలా ప్రతి చాప్టర్‌కు ఒక వినూత్న శీర్షిక పెట్టడంతో పాటు దానిని ఆసక్తికరంగా ముగిస్తూ వచ్చారు. ‘ఇది మీ సమయం. పూర్తిగా సద్వినియోగం చేసుకోండి’ అనే అధ్యాయం చివర్లో విద్యార్థులు 24 గంటల్లో తాము చేపట్టాలనుకున్న టైంటేబుల్‌ను తయారు చేసుకోవాలన్నారు.
‘పరీక్ష మీకోసం కాదు.. మీ సన్నద్ధతను తెలుసుకునేందుకే’, ‘మీతో మీరు పోటీపడాలి’, ‘చీట్ (కాపీ కొడితే) చేస్తే చీప్ అయిపోతారు’ వంటి శీర్షికలున్నాయి. స్కూలు నాటకంలో భాగంగా డైలాగ్ పలకడంలో ఎదురైన ఇబ్బందిని ఏ విధంగా అధిగమించారో ఒక అధ్యాయంలో చెప్పారు. ‘చిన్నపుడు మా ఊరి చెరువులో ఈత కొడుతూ కాలం గడిపేవాడిని. ఆరు బయలు, చల్లటి నీరు, వీచే గాలిని ఆస్వాదించే వాడిని’ అంటూ విద్యార్థులు చదువే కాకుండా ప్రకృతి మాధుర్యాన్ని అనుభవించాలన్నారు.
వన్‌వే టికెట్
‘ఒకసారి పరీక్షలు ముగిశాక జవాబు పత్రాల గురించి ఆలోచించకండి. గుజరాత్ సీఎంగా 2012లో నేనూ ఎన్నికల పరీక్షను ఎదుర్కొన్నాను. పోలింగ్ ముగియగానే, నా తదుపరి కార్యక్రమాలపై దృష్టిపెట్టాను. ‘వైబ్రంట్ గుజరాత్’ సదస్సు, ఇరిగేషన్ ప్రాజెక్టును సమీక్షించా. మీ జవాబుపత్రం మాదిరిగానే ఓటు అనేది నాకు ఒకవైపు ప్రయాణ టికెట్ (వన్ వే టికెట్) మాత్రమే’ అని అన్నారు.
వర్రీయర్స్ కాదు..వారియర్స్ కావాలి
అంధుల టీ–20 ప్రపంచకప్‌ను గెలుపొందిన భారత క్రికెట్ జట్టు సభ్యులను కలుసుకోవడం నాకు అత్యంత చిరస్మరణీయమైనది. ప్రతీ ఆటగాడు ప్రేరణ కలిగించే యోధుడే. జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ గర్వంగా విధికి ఎదురునిలిచి పోరాడారు. దేశం గర్వపడేలా చేశారు. ఇదే స్ఫూర్తితో విద్యార్థులు పరీక్షల్లో యోధులుగా నిలవాలి’ అని మోదీ ఉద్బోధించారు.
Comments
Please login to add a commentAdd a comment