న్యూఢిల్లీ: గతంలో ఘనమైన పేర్లున్న నేతలు పాలించినప్పటికీ సరైన పని సంస్కృతి లేని కారణంగానే దేశం వెనుకబాటుకు గురైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. దైనిక్ జాగరణ్ మీడియా గ్రూప్ శుక్రవారం నిర్వహించిన ‘జాగరణ్ ఫోరం’లో ఆయన ప్రసంగించారు. ‘ఘనమైన పేర్లున్న నేతలు గతంలో అధికారం చేపట్టారు. కానీ, దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపలేకపోయారు’ అని నెహ్రూ–గాంధీ కుటుంబం గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘గత నాలుగేళ్లలో సంభవించిన మార్పును మీకై మీరే చూశారు. గతంలో ఇలా జరగలేదు. ప్రజలు, అధికారులు, యంత్రాంగం అప్పటికీ ఇప్పటికీ మారనప్పటికీ పని సంస్కృతి లేని కారణంగానే దేశం వెనుకబడింది.
గత పాలకులు పేదరికాన్ని పారదోలి ఉన్నట్లయితే గరీబీ హఠావో నినాదాన్ని ఎందుకు ఇచ్చి ఉండేవారు? అది కచ్చితంగా ఓటు బ్యాంకు రాజకీయమే’ అని ప్రధాని అన్నారు. నిరుపేదలకు కనీస అవసరాలైన మరుగుదొడ్లు, వంటగ్యాస్, విద్యుత్, బ్యాంకు అకౌంట్, సమకూర్చి ఉంటే వారు తమంతట తామే పేదరికం నుంచి బయటపడి ఉండేవాళ్లు అని ఆయన తెలిపారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో భారీ లక్ష్యాలను సాధించేలా పెద్ద నిర్ణయాలు తీసుకునే సాహసం తమ ప్రభుత్వానికి ఉందని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో కంటే తమ ప్రభుత్వంలోనే పన్ను చెల్లింపు దారులు, జీఎస్టీ ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పెరిగారన్నారు. పారిపోయిన ఆర్థిక మోసగాళ్లను తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment