Dainik Jagran
-
అంబానీ రేడియో బిజినెస్ విక్రయానికి?
సాక్షి, ముంబై : అప్పుల సంక్షోభంలో చిక్కుకున్న పారిశ్రామికవేత్త, రిలయన్స్ కమ్యూనికేషన్ (ఆర్‌కాం)ఛైర్మన్ అనిల్ అంబానీ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అంబానీకి చెందిన రిలయన్స్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ (ఆర్‌బీఎన్) రేడియో బిజినెస్‌ను విక్రయించేందుకు నిర్ణయించుకున్నారంటూ తాజాగా పలు నివేదికలు మార్కెట్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అనిల్ ధీరుబాయి అంబానీ గ్రూప్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ లిమిటెడ్ నడుపుతున్న బిగ్ ఎఫ్ఎంను విక్రయించనుంది. హిందీ వార్తా పత్రిక దైనిక్ జాగరన్ దీనిని సొంతం చేసుకోనుంది. దైనిక్ జాగరన్ చీఫ్ ఎడిటర్, జాగరన్ ప్రకాశన్ కు చెందిన బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ రూ.1200 కోట్లకు దీన్ని దక్కించుకునేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. పూర్తి నగదు రూపంలో ఈ డీల్ ఉండబోతోంది. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 12 వేల కోట్ల రూపాయల అప్పులు తీర్చే క్రమంలో అంబానీకి ఈ విక్రయం భారీ ఊరటనిస్తుందని అంచనా. అయితే దీనిపై రిలయన్స్ గ్రూపునుంచి గానీ, ఇటు జాగరన్ ప్రకాశన్ నుంచి గానీ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. తాజా నివేదికల ప్రకారం మొదట 24 శాతం వాటాను ఎంబీఎల్ సొంతం చేసుకుంటుంది. దీనికి ప్రభుత్వ అనుమతి అవసరం లేదు. అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మూడేళ్లు ముగియకుండా మేజర్ వాటాను విక్రయించడానికి అనుమతి లేదు. బిగ్ ఎఫ్ఎంలో 59 రేడియో స్టేషన్లు ఉన్నాయి. మార్చి 31, 2018 నాటికి బిగ్ ఎఫ్ఎం 45 స్టేషన్లకు లాక్-ఇన్ పీరియడ్ ముగిసింది, అయితే మిగిలిన 14 స్టేషన్లకు 2020 మార్చిలో గడువు ముగుస్తుంది. దీని ప్రకారం మిగిలిన 14 స్టేషన్లు, 2020 లో వారి లాక్-ఇన్ వ్యవధి ముగిసిన తర్వాత బదిలీ అవుతాయి. జాగరన్ ప్రకాశన్‌కు చెందిన మ్యూజిక్ బ్రాడ్కాస్ట్ లిమిటెడ్( ఎంబీఎల్) రేడియో సిటీ పేరుతో ఎఫ్ఎం చానల్ నిర్వహిస్తోంది. ఎంబీఎల్ రేడియో సిటీ బ్రాండ్ క్రింద 39 స్టేషన్లు ఉన్నాయి. ఈడీల్ ముగిసిన అనంతరం దేశంలోనే అదిపెద్ద ఎఫ్ఎం స్టేషన్ బ్రాండ్‌గా ఎంబీఎల్ అవతరించనుంది. కాగా ప్రభుత్వ అనుమతి లభించని కారణంగా ఈ బిజినెస్ అమ్మకానికి సంబంధించి జీ గ్రూపుతో ఒప్పందానికి గతంలో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. -
పనిసంస్కృతి లేకే వెనకబడ్డాం
న్యూఢిల్లీ: గతంలో ఘనమైన పేర్లున్న నేతలు పాలించినప్పటికీ సరైన పని సంస్కృతి లేని కారణంగానే దేశం వెనుకబాటుకు గురైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. దైనిక్ జాగరణ్ మీడియా గ్రూప్ శుక్రవారం నిర్వహించిన ‘జాగరణ్ ఫోరం’లో ఆయన ప్రసంగించారు. ‘ఘనమైన పేర్లున్న నేతలు గతంలో అధికారం చేపట్టారు. కానీ, దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపలేకపోయారు’ అని నెహ్రూ–గాంధీ కుటుంబం గురించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ‘గత నాలుగేళ్లలో సంభవించిన మార్పును మీకై మీరే చూశారు. గతంలో ఇలా జరగలేదు. ప్రజలు, అధికారులు, యంత్రాంగం అప్పటికీ ఇప్పటికీ మారనప్పటికీ పని సంస్కృతి లేని కారణంగానే దేశం వెనుకబడింది. గత పాలకులు పేదరికాన్ని పారదోలి ఉన్నట్లయితే గరీబీ హఠావో నినాదాన్ని ఎందుకు ఇచ్చి ఉండేవారు? అది కచ్చితంగా ఓటు బ్యాంకు రాజకీయమే’ అని ప్రధాని అన్నారు. నిరుపేదలకు కనీస అవసరాలైన మరుగుదొడ్లు, వంటగ్యాస్, విద్యుత్, బ్యాంకు అకౌంట్, సమకూర్చి ఉంటే వారు తమంతట తామే పేదరికం నుంచి బయటపడి ఉండేవాళ్లు అని ఆయన తెలిపారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో భారీ లక్ష్యాలను సాధించేలా పెద్ద నిర్ణయాలు తీసుకునే సాహసం తమ ప్రభుత్వానికి ఉందని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో కంటే తమ ప్రభుత్వంలోనే పన్ను చెల్లింపు దారులు, జీఎస్టీ ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పెరిగారన్నారు. పారిపోయిన ఆర్థిక మోసగాళ్లను తిరిగి రప్పించేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. -
ఎగ్జిట్ పోల్ ప్రచురించిన పత్రికపై ఎఫ్ఐఆర్!
న్యూఢిల్లీ: తమ ఆదేశాలను ఉల్లంఘించి ఉత్తరప్రదేశ్‌లో మొదటి దశ ఎన్నికల ఎగ్జిట్‌పోల్ ఫలితాలను ప్రచురించిన హిందీ దినపత్రిక దైనిక్ జాగరణ్పై, 15 జిల్లాల్లోని దానికి సంబంధించిన ఏజెన్సీపై ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని ఎన్నికల కమిషన్ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సెక్షన్ 126(ఏ) ప్రకారం రెండేళ్ల జైలు లేదా, జరిమానా లేదా రెండు శిక్షలు అమలయ్యేలా చూడాలని ఉత్తరప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారికి ఎన్నికల కమిషన్ లేఖ రాసింది. ఎగ్జిట్ పోల్ వార్త పొరపాటున ఇంగ్లిషు వైబ్సెట్లో వచ్చిందని, గుర్తించిన వెంటనే ఆ వార్తను తొలగించామని దైనిక్ జాగరణ్ వార్తాపత్రిక తెలిపింది.