‘జనధన యోజన’కు శ్రీకారం | PM Narendra Modi launches Jan Dhan Yojana | Sakshi
Sakshi News home page

‘జనధన యోజన’కు శ్రీకారం

Published Fri, Aug 29 2014 1:35 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

‘జనధన యోజన’కు శ్రీకారం - Sakshi

‘జనధన యోజన’కు శ్రీకారం

*ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ
* ఆర్థిక అస్పృశ్యతను నిర్మూలించడమే లక్ష్యం
* జనవరి 26లోగా 7.5 కోట్ల మందికి బ్యాంక్ అకౌంట్లు

 
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ‘ప్రధాన్‌మంత్రి జన్‌ధన్ యోజన’ను ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురువారం ప్రారంభించారు. పేదలందరికీ బ్యాంక్ అకౌంట్లను సమకూర్చడం ద్వారా ఆర్థిక అస్పృశ్యతని, తద్వారా పేదరికాన్ని నిర్మూలించే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు. దీనిద్వారా 2015, జనవరి 26 నాటికి దేశంలోని ఏడున్నర కోట్లమందికి ‘రూపే’ డెబిట్ కార్డ్, జీరో బ్యాలెన్స్, లక్ష రూపాయల వరకు ప్రమాద బీమా, రూ. 30 వేల వరకు జీవిత బీమా సౌకర్యాలతో బ్యాంక్ అకౌంట్లను అందించనున్నారు. ఆర్నెళ్ల తరువాత రూ. 5 వేల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తారు. పథకం ప్రారంభించినరోజే దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కోటిన్నర బ్యాంక్ అకౌంట్లు ప్రారంభం కావడం విశేషం.
 
ఆ తల్లి ఆశీర్వదిస్తుంది: ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో గురువారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ పథకాన్ని ప్రారంభించి, మిషన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. జన్‌ధన్ పథకానికి ‘నా ప్రభుత్వం’ వెబ్‌సైట్ ద్వారా పేరును సూచించిన నలుగురికి రూ.25వేల చొప్పున నగదు, ప్రశంసాపత్రాలను అందచేశారు. బ్యాంకు ఖాతాలు ప్రారంభించిన ఐదు కుటుంబాలకు డెబిట్‌కార్డుల కిట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ..  ‘ఈ రోజు పేదరికం అనే విషవలయం నుంచి నిరుపేదలు స్వాతంత్య్రం పొందిన పర్వదినం’ అని అభివర్ణించారు.  
 
‘పేదరికాన్ని నిర్మూలించాలంటే ముందుగా ఆర్థిక అస్పృశ్యతను నిర్మూలించాలి. అందుకు దేశ ఆర్థిక వ్యవస్థతో ప్రతీ ఒక్కరినీ అనుసంధానించాలి. స్వాతంత్య్రం వచ్చి 68 ఏళ్లయినా.. జనాభాలో కనీసం 68% ప్రజలకు కూడా బ్యాంకింగ్ వ్యవస్థతో సంబంధం ఏర్పడకపోవడం విషాదకరం’ అన్నారు. ‘పేదలు కనీస వడ్డీకి ఐదు రెట్లు ఎక్కువ వడ్డీతో షావుకారు వద్ద డబ్బులు తీసుకుంటున్నారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలతో కుటుంబాలు నాశనమవుతున్నాయి. పేదలకు తక్కువ వడ్డీలకు డబ్బులు ఇచ్చే బాధ్యతను బ్యాంకులు నిర్వర్తించకూడదా?’ అని ప్రశ్నించారు. ‘పేదరికం నుంచి విముక్తి పొందడానికి చేపట్టిన ఈ ప్రయత్నం వచ్చే ఏడాది ఆగస్టు 15 వరకు ఎందుకు ఆగాలి.
 
అంతకు ముందే జనవరి 26లోపే పూర్తి చేయాలి’ అని బ్యాంకర్లు, ఆర్థిక శాఖ విభాగాల అధికారులను కోరారు. ఒక్కరోజులో 1.5 కోట్ల బ్యాంక్ అకౌంట్లను ప్రారంభించడం ద్వారా రికార్డు సృష్టించామన్నారు. ప్రభుత్వ సబ్సీడీ పథకాల్లో లొసుగులను అరికట్టడం ద్వారా అవినీతిపై పోరుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. తను కష్టపడి దాచుకున్న చిన్న మొత్తాన్ని ఇంట్లో ఏ మూలనో దాచుకునే తల్లికి బ్యాంక్ అకౌంట్ సమకూరిస్తే..  బ్యాంక్ అధికారులను ఆ తల్లి ఆశీర్వదిస్తుందని మోడీ అన్నారు.
 
అకౌంట్లు ప్రారంభించిన వారికి అందిస్తున్న ‘రూపే’ కార్డు ప్రఖ్యాత వీసా కార్డులా ప్రపంచవ్యాప్త గుర్తింపును, వినియోగాన్ని పొందాలని ప్రధాని ఆకాంక్షించారు. తాను స్కూల్లో ఉండగా దేనా బ్యాంక్‌లో అకౌంట్ ప్రారంభించానని, అయితే, తన దగ్గర డబ్బులు లేకపోవడంతో దాదాపు 20 ఏళ్లు ఆ అకౌంట్ నిరుపయోగంగా ఉందని ఆయన గుర్తు చేసుకున్నారు. దేశంలో ఇంకా 10 కోట్ల కుటుంబాలకు బ్యాంక్ అకౌంట్లు లేవని కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వివరించారు. ఈ పథకం ఉద్దేశాలు, లక్ష్యాలను కేంద్ర వాణిజ్యశాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. కార్యక్రమంలో ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, పలువురు బ్యాంకర్లు పాల్గొన్నారు.
 
దేశవ్యాప్తంగా ప్రారంభం
దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ పథకాన్ని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కొన్ని చోట్ల కేంద్రమంత్రులు ప్రారంభించారు. హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లక్నోలో, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ భోపాల్‌లో, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెన్నైలో, మానవవనరుల మంత్రి స్మృతి ఇరానీ సూరత్‌లో ప్రారంభించారు. దేశం మొత్తంమీద 600 కార్యక్రమాలు, 77,852 శిబిరాల ద్వారా భారీ స్థాయిలో ఈ ప్రతిష్టాత్మక పథకం ప్రారంభం కావడం విశేషం. ప్రభుత్వం ప్రారంభిస్తున్న సంక్షేమ పథకాలను గమనిస్తుంటే.. త్వరలోనే ఆర్థికపరంగా సూపర్ పవర్‌గా అమెరికా, చైనాల సరసన నిలుస్తుందన్న నమ్మకం కలుగుతోందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సమ్మిళిత ఆర్థికాభివృద్ధికి ఇది ముందడుగు అని సుష్మాస్వరాజ్ అభివర్ణించారు.
 
‘రూపే’ కార్డు విశేషాలు


* జన్‌ధన్ ద్వారా బ్యాంకు అకౌంట్లు ప్రారంభించిన వారికి రూపే డెబిట్ కార్డును ఇస్తారు.
* రూపే ప్లాట్‌ఫామ్‌ను నేషనల్ పేమెంట్స్ కా ర్పొరేషన్‌ఆఫ్‌ఇండియా రూపొందించింది. దీన్ని ఇప్పటికే ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, పీఎన్‌బీలు ఉపయోగిస్తున్నాయి.
* ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్న గేట్‌వేల్లో ఇది ఏడవది.
* ఏటీఎంల నుంచి డబ్బులను తీసుకునేందుకు, షాపుల్లో డబ్బులు చెల్లించేం దుకు, ఆన్‌లైన్ పేమెంట్ల కొరకు ఈ కార్డును ఉపయోగించుకోవచ్చు.
* కార్డుతో పాటు లభిస్తున్న బీమా సౌకర్యం కల్పించేందుకు ప్రైవేటు బీమా కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గొతో ఎన్‌పీసీఐ ఇప్పటికే  ఒప్పందాన్ని కుదుర్చుకుంది. త్వరలో ఎల్‌ఐసీతో ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది.
* రూపే కార్డు ఉన్నవారికి రూ. 30 వేల జీవిత బీమాను ఎల్‌ఐసీ అందించనుండగా, రూ. 1 లక్ష ప్రమాద బీమాను హెచ్‌డీఎఫ్‌సీ అందిస్తుంది. డెబిట్ కార్డు క్రియాశీలంగా ఉన్న వారికే బీమా సౌకర్యం ఉంటుంది. బీమా పొందే రోజు కన్నాముందు.. 45 రోజుల లోపల కార్డును ఉపయోగిస్తేనే కార్డు యాక్టివ్‌గా ఉన్నట్లు భావిస్తారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement