సావర్కర్‌కు మోడీ ఘన నివాళి
న్యూఢిల్లీ: కేంద్రంలో ప్రభుత్వం లేదా అధికారంలో ఉండే పార్టీ మారితే ప్రాధాన్యతలు కూడా మారతాయనడానికి ఇదో ఉదాహరణ. ఇన్నాళ్లూ ఎవరూ పెద్దగా పట్టించుకోని సావర్కర్ జయంతి ఉత్సవానికి అకస్మాత్తుగా ప్రాధాన్యత ఏర్పడింది. స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్ జయంతి సందర్భంగా బుధవారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లోని ఆయన చిత్రపటానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు మంత్రివర్గ సహచరులు, బీజేపీ అగ్రనేతలు ఘనంగా నివాళులర్పించారు. ఆ సమయంలో మరాఠీలో సావర్కర్ చేసిన ప్రసంగాన్ని వినిపించారు.
బీజేపీ సహా సంఘ్ పరివార్ సావర్కర్‌ను తమ నాయకుడిగా, నిర్దేశకుడిగా భావిస్తుంటుంది. కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు, గోపీనాథ్ ముండే తదితరులు సావర్కర్‌కు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. సావర్కర్‌ను గుర్తు చేసుకుంటూ ట్విటర్‌లో మోడీ ఒక ట్వీట్‌ను కూడా పోస్ట్ చేశారు. అందులో సావర్కర్ ఒక గొప్ప రచయిత, కవి, సామాజిక ఉద్యమకారుడు అని మోడీ కొనియాడారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సావర్కర్‌ను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ ఒక కరపత్రాన్ని ప్రచురించింది. కాగా, సంప్రదాయాన్ని పాటిస్తూ కొత్త మంత్రివర్గానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విందు ఇచ్చారు.
‘సమాఖ్య’ బలోపేతానికి కృషి: మోడీ
దేశ సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని నూతన ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రాష్ట్రాలు లేవనెత్తే అంశాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వాటి పట్ల సున్నితంగా వ్యవహరించాలని ప్రధానమంత్రి కార్యాలయ(పీఎంఓ) అధికారులను ఆదేశించారు. పీఎంఓ అధికారులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పీఎంఓ విధులు, బాధ్యతలకు సంబంధించి అధికారులు ఒక సమగ్ర నివేదిక సమర్పించారు. విధుల నిర్వహణలో వీలైనంతగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని మోడీ వారికి సూచించారు. అలాగే, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులపై తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలన్నారు. ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన అంశాలకు ప్రాధాన్యతనివ్వాలన్నారు.