
ఆరోగ్య రంగంలో మేక్ ఇన్ ఇండియా పరికరాలు, ఐటీ ఉత్పత్తులను విరివిగా వినియోగించడం, టెలీ మెడిసిన్‌కు మరింత ప్రాచుర్యం కల్పించడం.. ఈ అంశాలపై విరివిగా చర్చ జరగాల్సి ఉంది. ఆరేళ్లలో మా ప్రభుత్వం 4 అంశాలపై దృష్టి పెట్టింది. మొదటిది వ్యాధి నివారణ.. రెండోది చవకగా వైద్య సేవలు. మూడోది సరఫరాలో మెరుగైన విధానాలు అవలంబించడం. నాలుగోది యుద్ధ ప్రాతిపదికన కార్యక్రమాలు.
న్యూఢిల్లీ: మానవీయ అభివృద్ధి కోణంలో ప్రపంచమంతా ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.ఆరోగ్య రంగంలో దేశాలు సాధించే అభివృద్ధి ప్రాముఖ్యత ఈ కరోనా సంక్షోభ సమయంలో మరింత పెరిగిందన్నారు. ‘ఆరోగ్య రంగంలో మేక్ ఇన్ ఇండియా పరికరాలు, ఐటీ ఉత్పత్తులను విరివిగా వినియోగించడం, టెలీ మెడిసిన్‌కు మరింత ప్రాచుర్యం కల్పించడం.. ఈ అంశాలపై విరివిగా చర్చ జరగాల్సి ఉంది’ అన్నారు.
ముఖ్యంగా టెలీ మెడిసిన్‌కు మరింత ప్రాచుర్యం కలిగించేందుకు నూతన విధానాలను రూపొందించాల్సి ఉందన్నారు. బెంగళూరులోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం ఆయన వీడియో సందేశం ఇచ్చారు. పీపీఈ కిట్లు, ఎన్ 95 మాస్క్‌లు.. తదితర ఉత్పత్తులు దేశీయంగా పెద్దసంఖ్యలో తయారు కావడం అభినందనీయమన్నారు. కరోనాపై పోరులో ఆరోగ్య సేతు యాప్ కూడా గణనీయ పాత్ర పోషిస్తోందన్నారు.
ప్రపంచం చూపు వైద్య సిబ్బంది వైపు...
ప్రస్తుత కష్ట సమయంలో ప్రపంచమంతా డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, శాస్త్రవేత్తల వైపు ఆశగా, కృతజ్ఙతతో చూస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. వైద్య సిబ్బందిపై దాడులు చేయడం, వారితో దురుసుగా ప్రవర్తించడం ఆమోదనీయం కాదని మోదీ పేర్కొన్నారు. కొందరిలో ఉన్న మూక మనస్తత్వం వల్ల ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయన్నారు. దీనిపై వైద్య రంగమంతా ఆందోళన చెందుతున్న విషయం తనకు తెలుసన్నారు. కరోనాపై పోరులో ముందుండి పోరాడుతున్నవారిలో వైద్య సిబ్బంది కీలకమన్నారు. ‘వైద్యులు, వైద్య సిబ్బంది సైనికులతో సమానం.
ఆర్మీ యూనిఫాంలో లేని సైనికులు వారు. కరోనా కనిపించని శత్రువే కానీ మన వైద్యులు అపజయం ఎరగని సైనికులు’ అన్నారు. వైద్యులపై హింసాత్మక ఘటనలను నిరోధించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కోవిడ్–19 చికిత్సలో పాలు పంచుకుంటున్న వైద్యులు, వైద్య సిబ్బందిపై హింసకు పాల్పడడం నాన్ బెయిలబుల్ నేరమని, అందుకు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, రూ. 5 లక్షల వరకు జరిమానా విధించే అవకాశముందని స్పష్టం చేస్తూ కేంద్రం ఏప్రిల్‌లో ఒక ఆర్డినెన్స్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. గంగ దసరా సందర్భంగా ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
మేకిన్ ఏపీ.. తొలి అడుగు
మేకిన్ ఇండియాకు కేంద్రం పలు చర్యలు తీసుకుంటుండగా... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించే దిశగా ముందడుగు వేసింది. రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ విభాగాలూ... తమ అవసరాల కోసం జరిపే కొనుగోళ్లలో 25 శాతాన్ని స్థానిక ఎంఎస్‌ఎంఈల నుంచే చేయాలంటూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అన్ని ప్రభుత్వ విభాగాలతో పాటు స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, రాజ్యాంగ బద్ధమైన సంస్థలు, ఎస్‌పీవీలు, సొసైటీలు, ట్రస్టులు, ప్రభుత్వరంగ సంస్థలకు వర్తిస్తాయి. ఈ 25 శాతంలో 4 శాతాన్ని ఎస్‌సీ/ఎస్‌టీలు నిర్వహిస్తున్న సంస్థల నుంచి, 3 శాతాన్ని మహిళలు నిర్వహిస్తున్న సంస్థల నుంచి తప్పనిసరిగా కొనుగోలు చేయాలని తన ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.
విదేశీ వస్తువుల జాబితా వెనక్కి
స్వదేశీ వస్తువుల వాడకాన్ని ప్రోత్సహించేలా సీఏపీఎఫ్ (కేంద్ర సాయుధ బలగాలు) క్యాంటీన్లలో విదేశీ వస్తువుల విక్రయాలను నిషేధిస్తూ తీసుకొచ్చిన వెయ్యి విదేశీ ఉత్పత్తుల జాబితాను ప్రభుత్వం ఉపసంహరించింది. జూన్ 1 నుంచి విక్రయాల జాబితా అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, కేంద్రీయ పోలీస్ కల్యాణ్ భండార్ మే 29న జారీ చేసిన ఈ జాబితాలో కొన్ని దేశీయ ఉత్పత్తులు కూడా ఉన్నాయని అందువల్లనే కేంద్ర హోం శాఖ సోమవారం ఈ జాబితాను ఉపసంహరించిందని అధికారులు తెలిపారు. త్వరలోనే కొత్త జాబితాను విడుదల చేస్తామన్నారు. భారత కంపెనీలైన డాబర్, వీఐపీ ఇండస్ట్రీస్, యురేకా ఫోర్బ్స్, జాక్వెర్, నెస్లే వంటి సంస్థలకు చెందిన వస్తువులు కూడా తొలగింపునకు గురైన వస్తువుల లిస్టులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment