మీడియాతో నేరుగా మాట్లాడతా
ప్రధాని మోదీ హామీ
జాతీయ మీడియా ఎడిటర్లు సహా 400 మంది జర్నలిస్టులతో భేటీ
న్యూఢిల్లీ: ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇంతవరకు మీడియాతో నేరుగా సంభాషించని నరేంద్ర మోదీ ఎట్టకేలకు శనివారం విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘దివాళీ మిలన్’ కార్యక్రమంలో జాతీయ మీడియా ఎడిటర్లు సహా 400 మంది జర్నలిస్టులతో మోదీ ముచ్చటించారు. ఇకపై తాను నేరుగా మీడియా తో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇదే కార్యాలయంలో గతంలో ఆఫీస్ బేరర్‌గా తాను ఉన్నప్పుడు విలేకరుల కోసం కుర్చీలు వేసి వారి కోసం ఎదురుచూస్తుండేవాడినని మోదీ గుర్తుచేసుకున్నారు. ‘‘ఆ రోజులే వేరు. మనం అప్పుడు చాలా స్వేచ్ఛగా మాట్లాడుకునేవాళ్లం. మీతో నాకు చాలా మంచి సంబంధాలున్నాయి.. అవి గుజరాత్‌లో ఉపయోగపడ్డాయి. ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి మార్గాలు వెతుకుతున్నాను’’ అని అన్నారు. నేరుగా మాట్లాడడం వల్ల, మీడియా ప్రచురించలేని, ప్రసారం చేయలేని కొన్ని వాస్తవాలను తెలుసుకోవడం సాధ్యమవుతుందన్నారు.
నేను మీడియాకు రుణపడి ఉన్నాను..
‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని మారుమూల గ్రామాల వరకు తెలియజేసి వారిలో చైతన్యం తేవడంలో మీడియా చాలా ముఖ్య పాత్ర పోషించిందని మోదీ కొనియాడారు. ‘‘స్వచ్ఛ భారత్ విషయంలో మీడియా తన కలాన్ని చీపురుగా ఉపయోగించింది. ఇది జాతికి చేస్తున్న సేవ. ఈ విషయంలో నేను మీకు రుణపడి ఉన్నాను’’ అని అన్నారు. ఆరోగ్య రక్షణ కంటే.. అనారోగ్య నివారణ ముఖ్యమని, అందులో పరిశుభ్రత కీలకపాత్ర పోషిస్తుందన్నారు.
ఫొటోగ్రాఫర్ మోదీ!
అతడు బీజేపీ కార్యక్రమాలను కవర్ చేసే పార్టీ ఫొటోగ్రాఫర్. పేరు అజయ్ కుమార్ సింగ్. జర్నలిస్టులతో ప్రధాని సమావేశం సందర్భంగా వారితో కరచాలనం చేస్తూ, వారితో జోకులు వేస్తూ నవ్వులు చిందిస్తున్న నరేంద్ర మోదీని తన కెమెరాలో బంధించడానికి అతడు నానా తంటాలూ పడుతున్నాడు. మరోవైపు జర్నలిస్టులు మోదీతో కలిసి తమ సెల్ఫీలను సెల్ ఫోన్లలో బంధించుకోవడానికి పోటీపడుతున్నారు. ఇంతలో మోదీ అజయ్ కుమార్‌ను చూసి.. ఇప్పుడు నా వంతు అంటూ అతడి వద్ద కెమెరా లాక్కున్నారు. ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోని అతడిని మోదీ ఫొటో తీశారు. ఆ తర్వాత అతడితో కలిసి ఫొటో దిగారు. ‘‘ఇది నాకు దీపావళి సర్‌ప్రైజ్. నన్ను చాలా బాగా ఫొటో తీశారు’’ అంటూ ఆనందంతో అజయ్ చెప్పాడు.