కేదార్‌నాథ్/శ్రీనగర్: దీపావళి పండుగను సరిహద్దుల్లోని జవాన్లతో కలిసి జరుపుకున్న ప్రధాని మోదీ ఆ మర్నాడు ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారు. కేదార్‌నాథుడికి రుద్రాభిషేకం చేశారు. ఆలయం వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ‘అప్పట్లో ఈ గడ్డపైనే, బాబా( కేదారీశ్వరుడైన శివుడు) పాదాల చెంతనే శాశ్వతంగా ఉండాలనుకున్నా. కానీ బాబా మరోలా తలచాడు.
నేను ఈ ఒక్క బాబాకే సేవ చేయడం కాదు.. 125 కోట్ల మంది సేవలో తరించాలని ఆయన భావించాడు’ అని మోదీ ఉద్వేగంగా మాట్లాడారు. ఈ ఆలయాన్ని సందర్శించిన ప్రతిసారీ ప్రజాసేవ కొనసాగించాలన్న తన ప్రతిన మరింత బలోపేతమవుతుందన్నారు. 2013 నాటి వరద విలయం సృష్టించిన విషాదాన్ని ప్రస్తావిస్తూ.. గుజరాత్ సీఎంగా విలయానంతర పునర్నిర్మాణంలో పాలు పంచుకోవాలనుకున్న తన ఆకాంక్షను నాటి యూపీఏ ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు.
యూపీఏ అడ్డుకుంది!
‘ఆనాటి విలయ సమయంలో గుజరాత్ సీఎంగా ఉన్నాను. వరద బీభత్సాన్ని చూసి ఇక్కడికొచ్చి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించాను. గుజరాత్ సీఎం హోదాలో ఆలయం చుట్టూరా పునరుద్ధరణలో పాలు పంచుకుంటానని, వరదకారణంగా ధ్వంసమైన ప్రాంతాల అభివృద్ధికి బాధ్యత తీసుకుంటానని అప్పటి ఉత్తరాఖండ్ సీఎంను కోరాను. అందుకాయన అంగీకరించారు. దాంతో ఉత్సాహంగా, ఈ విషయాన్ని మీడియాతో పంచుకున్నాను. ఈ వార్త ఢిల్లీని (యూపీఏ ప్రభుత్వం) కుదిపేసింది.
గుజరాత్ సీఎం.. ఉత్తరాఖండ్‌కు వెళ్తే తమ పరిస్థితేంటనుకున్నారో? ఏమో? రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి నా ప్రతిపాదనను తిరస్కరిస్తున్నానని, ఉత్తరాఖండ్ అభివృద్ధికి ఏ రాష్ట్రం సాయం అక్కర్లేదని సీఎంతో చెప్పించారు’ అని మోదీ చెప్పారు. ‘అప్పుడు నిరాశగా వెళ్లిపోయాను. కానీ బాబా (శివుడు) సంకల్పం వేరోలా ఉంది. ఆలయం, చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి బాధ్యతను తన కుమారుడికే (మోదీకే) అప్పజెప్పాలని ఆయన అనుకున్నారు’ అని అన్నారు.
భక్తుల సౌకర్యాలు మెరుగుపరచటం, మందాకినీ, సరస్వతి నదుల రిటైనింగ్ వాల్స్, ఘాట్‌ల నిర్మాణం, దేవాలయానికి వెళ్లే రోడ్డును పునర్నిర్మించటం, వరదల్లో ధ్వంసమైన ఆది గురు శంకరాచార్య సమాధిని పనరుద్ధరించే పనులకు శంకుస్థాపన చేశారు. ఉత్తరాఖండ్‌ను అభిమాన పర్యాటక కేంద్రంగా మార్చుకోవాలని ప్రజలను కోరారు. 2022 కల్లా ఈ రాష్ట్రం పూర్తి ఆర్గానిక్ రాష్ట్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రాకముందు కేదార్‌నాథ్ ఆలయం సమీపంలోని గురూర్‌ఛట్టి ఆలయంలో తాను నివసించిన రోజులను మోదీ గుర్తుచేసుకున్నారు. ‘నాకు పరిచయం ఉన్న కొందరిని ఇవాళ కలిశాను. గురూర్‌ఛట్టిలో గడిపిన రోజులు గుర్తొచ్చాయ’న్నారు. శీతాకాలంలో కురిసే హిమపాతం కారణంగా శనివారం నుంచి ఈ ఆలయాన్ని 6 నెలలపాటు మూసివేయనున్నారు.
పాక్ సరిహద్దులో దీపావళి వేడుకల్లో..
ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి వరుసగా నాలుగో ఏడాదీ సైనికులతో ప్రధాని మోదీ దీపావళి సంబరాలు జరుపుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో నియంత్రణ రేఖ సమీపంలోని గురేజ్ సెక్టార్‌లో సైనికులతో కలిసి మోదీ వేడుకల్లో పాల్గొన్నారు. రెండుగంటలపాటు గురేజ్ లోయలో బీఎస్‌ఎఫ్ జవాన్లతో గడిపిన మోదీ.. సైనికులకు మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరిలాగే నేనూ కుటుంబంతో దీపావళి జరుపుకోవాలనుకుంటా. అందుకే నా కుటుంబంలో భాగమైన జవాన్లతో కలిసి పండుగ వేడుకలు జరుపుకుంటున్నాను’ అని అన్నారు. రోజూ యోగా చేస్తున్నట్లు జవాన్లు చెప్పటం ఆనందం కలిగించిందన్నారు. తమ ప్రభుత్వం సైన్యం సంక్షేమం కోసం వీలునన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఆర్మీ చీఫ్ జనరల్ రావత్, ఇతర సీనియర్ ఆర్మీ అధికారులు ప్రధానితోపాటు గురేజ్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.
అండమాన్‌లో వేడుకల్లో నిర్మలా
బంగాళాఖాతంలోని అత్యంత వ్యూహాత్మక త్రివిధ దళాల కేంద్రమైన అండమాన్ నికోబార్ దీవుల్లో సైనికులతో కలిసి రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. భద్రతా సన్నద్ధతను సమీక్షించారు. అండమాన్ నికోబార్ కమాండ్ ఏరియా ప్రాంతంలోని కోస్ట్ గార్డ్ బేస్, నౌకాదళ కేంద్రాలనూ ఆమె సందర్శించారు. కార్ నికోబార్ దీవుల్లో సునామీ సందర్భంగా మరణించిన భారత వైమానిక దళ సభ్యులు, వారి కుటుంబీకులకు ఆమె పుష్పాంజలి ఘటించారు.
ఇది కేదార్‌నాథుడి సంకల్పమే!
Published Fri, Oct 20 2017 10:05 AM | Last Updated on Wed, Oct 17 2018 5:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment