తమిళతీరంలో మోదీ సమరశంఖం!
కోయంబత్తూరు: మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తమిళనాడులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అందరికన్నా ముందే ప్రచారశంఖాన్ని పూరిస్తున్నారు. బీజేపీ తరఫున ఆయన మంగళవారం కోయంబత్తూరులో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. కోయంబత్తూరులో జరుగనున్న ఈ భారీ బహిరంగ సభ ద్వారా అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ తరఫున అధికార ప్రచారాన్ని మోదీ ప్రారంభించనున్నారని, ఈ ప్రచార సభ తమిళనాడు ఎన్నికల చరిత్రలో సరికొత్త మలుపు కానుందని బీజేపీ వర్గాలు ఉత్సాహంగా చెప్తున్నాయి.
టెక్స్ టైల్ పట్టణంగా పేరొందిన కోయంబత్తూరుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 20 స్మార్ట్ సిటీలో చోటు దక్కింది. ఎన్నికల రాష్ట్రం కావడంతో కోయంబత్తూరును కేంద్రం ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ పట్టణంలోనే మోదీ ప్రచార పర్వానికి తెరతీస్తున్నారు. ఐదు గంటలపాటు కోయంబత్తూరులో ఉండనున్న మోదీ ఇక్కడ ఈఎస్ఐ మెడికల్ కాలేజీని ప్రారంభించడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు.