![PMO Seeks Suggestions From Commerce Ministry On Curbing Chinese Imports - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/7/china%20india.jpg.webp?itok=vUA_-aUJ)
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన, పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో డ్రాగన్‌పై నలువైపులా ఒత్తిడి పెంచేందుకు భారత్ సిద్ధమవుతోంది. టిక్‌టాక్ సహా చైనాకు చెందిన 50 యాప్‌లను ఇప్పటికే బహిష్కరించిన ప్రభుత్వం బీజింగ్ నుంచి దిగుమతులను నియంత్రించేందుకు అవసరమైన చర్యలను సూచించాలని పీఎంఓ వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరింది. గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మరణించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డ్రాగన్‌పై పెంచుతున్నదౌత్య, ఆర్థిక ఒత్తిళ్లలో భాగంగా ఈ ప్రక్రియ సాగుతోంది.
చైనా నుంచి దిగుమతులను వీలైనంతగా తగ్గించేందుకు సూచనలు ఇవ్వాలని పీఎంఓ అధికారులు వాణిజ్య మంత్రిత్వ శాఖను కోరినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇతర దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (ఎఫ్‌టీఏ)ను సైతం పీఎంఓ సమీక్షిస్తోంది. ఎఫ్‌టీఏ పేరుతో భారత్‌కు చవకైన వస్తువులను గుమ్మరిస్తున్న దేశాలకు చెక్ పెట్టేందుకు కూడా ప్రభుత్వం సంసిద్ధమైంది. స్వయం సమృద్ధ భారత్ నినాదం కింద చైనా సహా ఇతర దేశాల నుంచి దిగుమతులను గణనీయంగా తగ్గించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
దక్షిణ కొరియా, మలేషియా, సింగపూర్ సహా ఆసియాన్ దేశాల దిగుమతులపై కూడా ప్రభుత్వం సమీక్షించనుంది. ఆత్మనిర్భర్ మిషన్ కింద దేశీయంగా తయారీని ప్రోత్సహించడంతో పాటు చైనా నుంచి వచ్చే తక్కువ నాణ్యతతో కూడిన దిగుమతులను నిరోధించేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. చదవండి : కోవిడ్-19 : చైనాను దాటేసిన ముంబై
Comments
Please login to add a commentAdd a comment