టూరిస్టులు మున్ముందు కుప్పలుగా వస్తారు
న్యూఢిల్లీ: భారత దేశాన్నిసందర్శించే పర్యాటకుల సంఖ్య ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనలతో మరింత రెట్టింపు అవనుందని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి మహేశ్ శర్మ అన్నారు. బుధవారం ఆయన ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్(ఐఏటీవో) సమావేశంలో మాట్లాడుతూ మోదీ అమెరికా పర్యటన వల్ల అక్కడి నుంచి భారత్ను సందర్శించడానికి వచ్చిన అమెరికన్ పర్యాటకుల సంఖ్య 10.3శాతానికి చేరిందన్నారు.
అలాగే, బ్రెజిల్ పర్యాటకుల సంఖ్య 13.7 శాతానికి పెరిగిందని అలాగే జర్మనీ నుంచి 5శాతం, కెనడా నుంచి 7శాతం, ఉజ్బెకిస్థాన్ నుంచి 49శాతం, మ్యాన్ మార్ నుంచి 30శాతం పర్యాటకులు పెరిగారని చెప్పారు. ఇది మన ప్రధాని మోదీకి ఉన్న దూరదృష్టికి నిదర్శనమని కొనియాడారు. ఆయన ఆలోచనలతో టూరిజంశాఖ భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచేలా చూస్తున్నారని అన్నారు. ఐఏటీవో 31వ ఆవిర్భావ దినోత్సవం ఇండోర్లో ఆగస్టు 20 నుంచి 23 మధ్య నిర్వహించనున్నామని, అప్పటిలోగా ఏవైనా మార్పులు వస్తే ముందే సూచిస్తామని తెలిపారు.