బదౌన్ పోలీసుల అమానుష చర్య
లక్నో: కరోనా వ్యాప్తి నివారణకు లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో బడుగులపై ప్రతాపం చూపిన ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎట్టకేలకు క్షమాపణ చెప్పారు. వలస కార్మికులను విచక్షణారహితంగా వేధించినందుకు లెంపలు వేసుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘిచారన్న కోపంతో వలస కూలీల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన ఘటన బదౌన్‌లోని సివిల్‌లైన్స్ ప్రాంతంలో గురువారం చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌తో ఉపాధి లేక కాలినడక స్వస్థలాలకు పయనమైన యువకుల పట్ల పోలీసులు అవమానవీయంగా ప్రవర్తించారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్డు మీదకు వచ్చారన్న ఆగ్రహంతో ఐదుగురు యువకులను మోకాళ్లపై కూర్చొపెట్టి నడిపించారు. వీపు మీద బ్యాగులతో మోకాళ్లపై నడవలేక ఎంతో బాధ అనుభవించారు. (కరోనా నెగటివ్: అయ్యో పాపం)
ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. వలస కార్మికుల పట్ల తమ సిబ్బంది వ్యవహరించిన తీరు బాధాకరంగా, అవమానకరంగా ఉందని బదౌన్ పోలీస్ చీఫ్ ఏకే త్రిపాఠి పేర్కొన్నారు. జరిగిన దారుణానికి క్షమాపణ చెప్పారు. ఇలాంటి ఘటన జరిగివుండకూదని, కారుకుడైన ట్రైనీ కానిస్టేబుల్‌ను విధుల నుంచి తొలగించామని చెప్పారు. అక్కడే ఉన్న మరో కానిస్టేబుల్ ప్రమేయంపై దర్యాప్తు జరిపి చర్య తీసుకుంటామన్నారు.
కాగా, లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్న ఘటనలు చాలా చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. అత్యవసర సేవల సిబ్బందిని కూడా అడ్డుకున్న ఉదంతాలు కూడా బయటపడ్డాయి. పోలీసులు సంయమనంతో వ్యవహరించి, ప్రస్తుత పరిస్థితులపై అవగాహన కల్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు. (మఫ్టీలో వచ్చి.. కానిస్టేబుల్ అనుచిత చర్య)
Comments
Please login to add a commentAdd a comment