సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా గ్రీన్, ఆరెంజ్ జోన్లలో సోమవారం మద్యం షాపులు తెరుచుకున్నాయి. మద్యం కోసం 40 రోజులుగా వేచిచూస్తున్న మందు బాబులు ఒక్కసారిగా లిక్కర్ షాపుల ముందు బారులుతీరారు. అన్ని మద్యం షాపుల ముందు పొడవాటి క్యూలు దర్శనమిచ్చాయి. మూడో దశ లాక్‌డౌన్ ప్రారంభమైనా ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీ, కర్ణాటక, చత్తీస్‌గఢ్, హర్యానా, ఏపీ, గోవా సహా పలు రాష్ట్రాల్లో మద్యం విక్రయాలకు అనుమతించారు.
కంటైన్మెంట్ జోన్లకు వెలుపల మద్యం దుకాణాలకు నిర్ధేశిత సమయంలోనే అధికారులు అనుమతించారు. భౌతిక దూరం పాటించాలనే నిబంధనను మద్యం ప్రియులు పలు చోట్ల ఖాతరు చేయకపోవడంతో ఆయా షాపులను అధికారులు మూసివేయిన్నారు. ఢిల్లీలోని ఓ లిక్కర్ షాప్ వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడంతో లిక్కర్ స్టోర్‌ను మూసివేశామని కరోల్‌బాగ్ ఎస్‌హెచ్‌ఓ మణీందర్ సింగ్ వెల్లడించారు. ఢిల్లీ ప్రభుత్వం కంటైన్మెంట్ జోన్లు మినహా వైన్ షాపులను, కాలనీల్లోని వైన్ షాపులకు అనుమతించింది. పలు మద్యం దుకాణాల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించకపోవడంతో పోలీసులు మధ్యాహ్నానికే ఆయా షాపులను మూసివేయించారు. ప్రజలు భౌతిక దూరం పాటించేలా తగిన ఏర్పాట్లు చేసేవరకూ లిక్కర్ షాపులను తెరిచేందుకు అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు.
మద్యం, గుట్కా, పాన్ షాపుల వద్ద ఒకే సమయంలో ఐదుగురు మించి ఉండరాదని, వారి మధ్య ఆరు అడుగుల దూరం పాటించాలని ఢిల్లీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల్లో వెల్లడించింది. ఇక కర్ణాటకలోనూ మద్యం షాపులు తెరుచకున్నాయి. 40 రోజుల లాక్‌డౌన్‌లో మద్యం విక్రయాలు నిలిచిపోవడంతో రోజుకు రూ 60 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి హెచ్ నగేష్ వెల్లడించారు.
చదవండి : అందుకే మద్యం ధరలు పెంచారు : రోజా
లిక్కర్‌పై కోవిడ్-19 సెస్
మద్యంపై కోవిడ్-19 సెస్‌ను విధించాలని హర్యానా ప్రభుత్వం యోచిస్తోంది. మద్యం నాణ్యత, పరిమాణం ఆధారంగా రూ 2 నుంచి రూ 20 వరకూ సెస్ విధించాలని భావిస్తున్నామని డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా వెల్లడించారు. ఇక ఏపీ, మహారాష్ట్ర, యూపీ సహా పలు రాష్ట్రాలు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం విక్రయాలను అనుమతించాయి.
Comments
Please login to add a commentAdd a comment