
పశువులు మేపుకుంటున్న గౌరీమణి భొత్ర
ఒడిశా, జయపురం: దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో నమోదైన గంజాయి కేసులో ఒడిశాకు చెందిన ఆదివాసీ నిరుపేద మహిళను నిందితురాలిగా చేసి కోర్టుకు హాజరుకావాలని ఉత్తరప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ నోటీసులు పంపింది. అవిభక్త కొరాపుట్‌లోని నవరంగపూర్ జిల్లా పపడహండి సమితిలో చిన్న కుగ్రామం సన్యాసిగుడలో పశువులు మేపుకుంటూ జీవనం సాగిస్తున్న గౌరిమణి భొత్ర అనే మహిళకు నాలుగు రోజుల క్రితం ఈ నోటీసులు అందాయి. గంజాయి కేసులో నిందితురాలు లక్నోలోని కార్యాలయంలో హాజరుకావాలని నోటీసు సారాంశం. ఇంతవరకూ ఆమె తన జిల్లా కేంద్రాన్నే చూసి ఎరుగదు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ ఉందో తెలియని నిరక్షరాస్య, నిరుపేద మహళా పశువుల కాపరికి ఆ నోటీసు ఎందుకు వచ్చిందో? ఎవరు పంపారో తెలియక, అందులో ఏముందో అర్థం కాక ముచ్చెమటలు పట్టి అందరి వద్దకు తిరిగి చదివి వినిపించమని వేడుకుంది. ఆ గ్రామంలోనే కాదు పరిసర గ్రామాలలో ఆ నోటీసు చదవగల వారు ఎవరూ లేక పోవడంతో మంత్రిగుడలో ఒక ఉపాధ్యాయుడితో చదివించుకుంది.
ధైర్యం చెప్పిన ఎస్‌పీ కుశలకర్
నోటీసులో విషయం తెలిశాక తాను గంజాయి కేసులో ఎప్పుడు? ఎక్కడ? పట్టుబడ్డానంటూ తల పట్టుకుంది. మూడు నాలుగు రోజులు మానసిక వ్యధ పొందిన ఆమె చివరికి ఉపాధ్యాయుని సలహా మేరకు గురువారం నవరంగపూర్ వచ్చి ఎస్‌పీ కుశలకర్‌ను కలిసి నోటీసు చూపింది. నోటీసు చదివిన ఎస్‌పీ ఏమీ కాదని భరోసా ఇవ్వడంతో ఊరట చెంది ఇంటికి మళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment