పాఠశాలలకు బాంబు బెదిరింపు
తిరువొత్తియూరు: చెన్నై వలసరవాక్కం, విరుగంబాక్కంలోని రెండు పాఠశాలల్లో బాంబు పెట్టినట్టు సోమవారం ఉదయం పోలీసులకు ఫోన్ కాల్ వచ్చింది. చెన్నై పోలీసు కంట్రోల్ గదికి సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి వలసరవాక్కంలో ఉన్న వెంకటేశ్వర పాఠశాల, విరుగంబాక్కంలో ఉన్న సెయింట్ జాన్స్ పాఠశాలల్లో బాంబు పెట్టినట్టు తెలిపి ఫోన్ కట్ చేశాడు. దీని గురించి వెంటనే వలసరవాక్కం, విరుగంబాక్కం పోలీసుస్టేషన్‌లకు సమాచారం అందించారు.
సహాయ కమిషనర్ జాన్ అరుమైరాజ్, ఇన్‌స్పెక్టర్లు, సేటు, జాయిరోజ్ వెళ్లి రెండు పాఠశాలల్లో బాంబు స్క్వాడ్‌లు తనిఖీ చేశారు. విషయం తెలిసి తల్లిదండ్రులు పాఠశాలల వద్దకు హుటాహుటిన చేరుకుని తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. బాంబుస్క్వాడ్ నిపుణులు ఉదయం 11.30 గంటల వరకు తనిఖీ చేసి బాంబు లేనట్టు నిర్ధారించారు. దీంతో పాఠశాల నిర్వాహకులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.