లక్నో: ఉత్తరప్రదేశ్ పోలీసులు ప్రయివేటు బ్లడ్ బ్యాంక్ యజమానులు చేస్తున్న కల్తీ రక్తం విక్రయాల రాకెట్‌ను ఛేదించారు. రాష‍్ట్రంలోని పలు బ్లడ్ బ్యాంకులు కల్తీ చేసిన రక్తాన్ని అంటగట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రత్యేక టాస్క్ ఫోర్స్ గురువారం రాత్రి నిర్వహించిన దాడుల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
పక్కా సమాచారంతో రెండు ప్రయివేటు బ్లడ్ బ్యాంకుల్లో నిఖీలు చేపట్టిన అధికారులు అయిదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మారువేషంలో అనేక ఆస్పత్రులు రక్త బ్యాంకులకు వెళ్లిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఈ రాకెట్‌ను ఛేదించింది. పరిశీలన కోసం కొన్ని కీలక పత్రాలు, లెడ్జర్ ఫైళ్లను స్వాధీనం చేసుకుంది.
రిక్షా డ్రైవర్లు, ఇతర రోజువారీ కూలీలకు వెయ్యి, రెండువేల రూపాయలు చెల్లించి రక్తం తీసుకుంటారు. దీనికి కెమికల్, నీళ్లు కలిపి కల్తీ రక్తాన్ని యధేచ్చగా తయారు చేస్తారు. ఇలా ఒక ప్యాకెట్‌కు రెండు ప్యాకెట్ల చొప్పున తయారు చేసి విక్రయిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి రషీద్‌అలీ, రాఘవేంద్ర ప్రతాప్‌సింగ్, మహమ్మద్ నసీమ్, పంజక్ కుమార్, రజనీష్‌నిగం లను అరెస్ట్ చేశామని ఎస్‌టీఎఫ్ అధికారులు తెలిపారు. గత ఆరునెలలుగా ఈ దందా నడుస్తున్నట్టు గుర్తించామన్నారు. గత ఆరు నెలల కాలంలో దాదాపు వెయ్యి యూనిట్ల నకిలీ, కల్తీ రక్తం మార్కెట్‌లోకి తరలిపోయిందని చెప్పారు. ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులకు ఈ రక్తాన్ని విక్రయించినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. అంతేకాదు ఇందులో కొంత మంది డాక్టర్లు, నర్సులుకు కూడా భాగస్వామం ఉందని అధికారులు తెలిపారు. దీంతోపాటు ఇతర బ్లడ్‌బ్యాంకుల వ్యవహరాన్ని కూడా పరిశీలి స్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment