చారిత్రాత్మక 'హస్తం' గుర్తుకు ఎన్నికల కష్టాలు!
చారిత్రాత్మక 'హస్తం' గుర్తుకు ఎన్నికల కష్టాలు!
Published Tue, Apr 8 2014 1:28 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఒకరిపై కారాలు మిరియాలు నూరుకోవడం, ఫిర్యాదులు చేసుకోవడం సహజమే. త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో చంఢీఘడ్ లోని 'ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్'పై ప్రత్యర్ధి పార్టీలు ఫిర్యాదు చేశాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పోలి వుండే ఈ చారిత్రాత్మక కట్టడం ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో వివాదస్పదమైంది. 'చంఢీఘడ్ అందర్ని అక్కున చేర్చుకుంటుంది' (ఓపెన్ టు గివింగ్, రిసీవింగ్) అనే సందేశంతో ఈ కట్టడం చంఢీఘడ్ వాసుల్నే కాకుండా ఇతర అనేకమంది పర్యాటకులను ఆకట్టుకుంటోంది. చంఢీఘడ్ వారసత్వ సంపదగా నిలిచిన కట్టడంపై రాజకీయ పార్టీలు చేసిన ఫిర్యాదును ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు.
ప్రముఖ ఫ్రెంచ్ అర్కిటెక్ట్ లీ కర్పూసియర్ డిజైన్ చేసిన ఈ కట్టడం చంఢీఘఢ్ కాపిటల్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 1లో ఉంది. 26 మీటర్ల ఎత్తు, బరువు 50 టన్నులు ఉన్న ఈ కట్టడం ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఎన్నికల కమీషన్ కు రాజకీయ నేతలు ఫిర్యాదు చేశారు. 'ఓపెన్ హ్యాండ్..'పై ఫిర్యాదు చేయడాన్ని కాంగ్రెస్ అభ్యర్థి పవన్ కుమార్ భన్సల్ నిరసన తెలుపుతున్నారు. గత నాలుగు ఎన్నికల్లో చంఢీఘడ్ లో తాను విజయం సాధించానని.. ఎన్నడూ, ఏ రాజకీయ పార్టీ కూడా చారిత్రాత్మక కట్టడంపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని భన్సల్ వెల్లడించారు. శాంతి, సమన్వయానికి సూచికగా నిలిచిన 'ఓపెన్ హ్యాండ్'కు రాజకీయ రంగు పులమడాన్ని భన్సల్ తప్పుపట్టారు.
చంఢీఘడ్ పట్టణంలో అందర్ని ఆకర్షించే హ్యాండ్ సింబల్ పై చేసిన ఫిర్యాదును ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. చారిత్రాత్మక కట్టడంపై ఎన్నికల కమీషన్ తీవ్రంగా స్పందిస్తే.. ఎన్నికలు ముగిసే వరకు కనపడనీయకుండా జాగ్రత్త తీసుకోవడమో.. లేదా ముసుగు వేసి కనిపీయకుండా చేయడమో చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయ పార్టీల ఒత్తిడి, ఫిర్యాదు మేరకు 'ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్'పై ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే అంశంపై చంఢీఘడ్ వాసుల్లో ఉత్కంఠ పెరిగింది. ఈ చారిత్రాత్మక కట్టడం ఓటర్లను ప్రభావం చూపే విధంగా ఉందని ఎన్నికల కమీషన్ భావిస్తే ఈ ఎన్నికల్లో 'ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్' ముసుగు తొడగాల్సిన పరిస్థితి ఎర్పడవచ్చు. చారిత్రాత్మక కట్టడాల కారణంగా కూడా రాజకీయ పార్టీలు అభద్రతాభావానికి గురైతే, మున్ముందు మరిన్ని సమస్యలు ఎదురవుతాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున మాజీ కేంద్రమంత్రి పవన్ కుమార్ భన్సల్, బీజేపీ తరపున బాలీవుడ్ నటి కిరణ్ ఖేర్, మరో సినీతార గుల్ పనాగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రంగంలో ఉన్నారు.
Advertisement
Advertisement