Open Hand Monument
-
పేదింటికి పెద్ద కష్టం !
అనంతపురం కల్చరల్ /రాప్తాడు: జీవితాంతం తోడుంటానని బాస చేసిన భర్త కళ్ల ముందే మరణించడంతో ఓ మహిళ కన్నీరు మున్నీరైంది. ఆ బాధ నుంచి తేరుకోకముందే కన్న కొడుకు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండటంతో ఆ తల్లి తల్లడిల్లిపోతోంది. చిన్న వయసులోనే కట్టుకున్న భర్త మంచం పట్టడంతో భార్య ... తన తండ్రికి ఏమైందో తెలీక ఓ మూడేళ్ల బాలుడు.. ఇలా ఓ కుటుంబాన్ని కష్టాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. గుత్తి మండలం రజాపురానికి చెందిన ఆదిలక్ష్మమ్మ భర్త మార్కెట్‌యార్డులో పనిచేస్తుండేవాడు. ఆయన చనిపోవడంతో కుమారుడు కృష్ణమూర్తి, కోడలు ఆదెమ్మతో కలసి అనంతపురంలోని చిన్మయనగర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉండేవారు. ఆదిలక్ష్మమ్మ పెన్షన్‌తో ఆ కుటుంబం జీవనం సాగించేది. అయితే ఆదిలక్ష్మమ్మ 2021 ఫిబ్రవరిలో మరణించడంతో వారి కష్టాలు ప్రారంభమయ్యాయి. అదే సంవత్సరం అక్టోబరులో ఆదెమ్మ కుమారుడు సాకే శ్రీకాంత్ (32)కు రెండు కిడ్నీలు చెడిపోయాయి. కుమారుడికి వచ్చిన జబ్బును చూసి కుంగిపోయిన ఆదెమ్మ భర్త కృష్ణమూర్తి కూడా నవంబరు 1న చనిపోవడంతో ఇక ఆ ఇల్లు దిక్కులేనిదైంది. వారంలో ఐదుసార్లు డయాలసిస్ చేస్తేకానీ శ్రీకాంత్ బతికే పరిస్థితి లేదని డాక్టర్లు చెప్పడంతో తల్లి ఆదెమ్మ , భార్య మల్లిక కన్నీరుమున్నీరవుతున్నారు. కష్టాల్లో శ్రీకాంత్ కుటుంబం బీటెక్ పూర్తి చేసిన సాకే శ్రీకాంత్ ఆరు నెలల కిందట వరకు హుషారుగానే ఉండేవాడు. హైదరాబాద్‌లో అనే సంస్థల్లోనూ పనిచేశాడు. 2018లో వజ్రకరూరు మండలం, కొనకొండ్లకు చెందిన మల్లికతో వివాహం జరగడంతో విశాఖపట్నం సమీపంలోని అనకాపల్లిలో హార్డ్‌వేర్ ఇంజనీరుగా చేరాడు. వారికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే విధి వారిని చిన్నచూపు చూసింది. గత సంవత్సరం అక్టోబరు నెలలో అనారోగ్యంగా ఉందని హాస్పిటల్‌కు వెళితే శ్రీకాంత్ రెండు కిడ్నీలు పాడయ్యాయని తేలింది. దీంతో అప్పటి నుంచి ఆస్పత్రుల చుట్టూ తిరిగేందుకు ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టేశారు. ఆఖరికి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో వైద్యులు మాత్రం ఆపరేషన్‌తో సమస్య తీరుతుందని దానికి రూ.40 లక్షలు అవసరమవుతాయని తేల్చి చెప్పారు. బిడ్డను బతికించండయ్యా... రెండు కిడ్నీలు పాడైపోయి నా బిడ్డ పడుతున్న బాధ చూడలేకపోతున్నా. ఉన్న డబ్బంతా ఆస్పత్రులకే ఖర్చు పెట్టా. మా ఇంటి భారాన్ని కూతురు, అల్లుడు మోస్తున్నారు. బిడ్డ బతకాలంతే రూ.40 లక్షలు అవసరమంట. దయగల మారాజులు చేతనైంత సాయం చేసి నా కొడుకును బతికించండయ్యా.. – ఆదెమ్మ , సాకే శ్రీకాంత్ తల్లి దాతలు సాయం చేయదలిస్తే... సాకే శ్రీకాంత్ సెల్ నంబర్ – 7658971971 ఎస్బీఐ , జేఎన్టీయూ బ్రాంచ్ అకౌంట్ నం: 30453144331 ఐఎఫ్ఎస్సీ కోడ్ – ఎస్బీఐఎన్ 0021008 గూగుల్‌పే /ఫోన్‌పే నం – 7658971971 -
చారిత్రాత్మక 'హస్తం' గుర్తుకు ఎన్నికల కష్టాలు!
ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఒకరిపై కారాలు మిరియాలు నూరుకోవడం, ఫిర్యాదులు చేసుకోవడం సహజమే. త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో చంఢీఘడ్ లోని 'ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్'పై ప్రత్యర్ధి పార్టీలు ఫిర్యాదు చేశాయి. దాంతో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పోలి వుండే ఈ చారిత్రాత్మక కట్టడం ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో వివాదస్పదమైంది. 'చంఢీఘడ్ అందర్ని అక్కున చేర్చుకుంటుంది' (ఓపెన్ టు గివింగ్, రిసీవింగ్) అనే సందేశంతో ఈ కట్టడం చంఢీఘడ్ వాసుల్నే కాకుండా ఇతర అనేకమంది పర్యాటకులను ఆకట్టుకుంటోంది. చంఢీఘడ్ వారసత్వ సంపదగా నిలిచిన కట్టడంపై రాజకీయ పార్టీలు చేసిన ఫిర్యాదును ఎన్నికల అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రముఖ ఫ్రెంచ్ అర్కిటెక్ట్ లీ కర్పూసియర్ డిజైన్ చేసిన ఈ కట్టడం చంఢీఘఢ్ కాపిటల్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 1లో ఉంది. 26 మీటర్ల ఎత్తు, బరువు 50 టన్నులు ఉన్న ఈ కట్టడం ఓటర్లను ప్రభావితం చేస్తుందని ఎన్నికల కమీషన్ కు రాజకీయ నేతలు ఫిర్యాదు చేశారు. 'ఓపెన్ హ్యాండ్..'పై ఫిర్యాదు చేయడాన్ని కాంగ్రెస్ అభ్యర్థి పవన్ కుమార్ భన్సల్ నిరసన తెలుపుతున్నారు. గత నాలుగు ఎన్నికల్లో చంఢీఘడ్ లో తాను విజయం సాధించానని.. ఎన్నడూ, ఏ రాజకీయ పార్టీ కూడా చారిత్రాత్మక కట్టడంపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని భన్సల్ వెల్లడించారు. శాంతి, సమన్వయానికి సూచికగా నిలిచిన 'ఓపెన్ హ్యాండ్'కు రాజకీయ రంగు పులమడాన్ని భన్సల్ తప్పుపట్టారు. చంఢీఘడ్ పట్టణంలో అందర్ని ఆకర్షించే హ్యాండ్ సింబల్ పై చేసిన ఫిర్యాదును ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. చారిత్రాత్మక కట్టడంపై ఎన్నికల కమీషన్ తీవ్రంగా స్పందిస్తే.. ఎన్నికలు ముగిసే వరకు కనపడనీయకుండా జాగ్రత్త తీసుకోవడమో.. లేదా ముసుగు వేసి కనిపీయకుండా చేయడమో చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయ పార్టీల ఒత్తిడి, ఫిర్యాదు మేరకు 'ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్'పై ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే అంశంపై చంఢీఘడ్ వాసుల్లో ఉత్కంఠ పెరిగింది. ఈ చారిత్రాత్మక కట్టడం ఓటర్లను ప్రభావం చూపే విధంగా ఉందని ఎన్నికల కమీషన్ భావిస్తే ఈ ఎన్నికల్లో 'ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్' ముసుగు తొడగాల్సిన పరిస్థితి ఎర్పడవచ్చు. చారిత్రాత్మక కట్టడాల కారణంగా కూడా రాజకీయ పార్టీలు అభద్రతాభావానికి గురైతే, మున్ముందు మరిన్ని సమస్యలు ఎదురవుతాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున మాజీ కేంద్రమంత్రి పవన్ కుమార్ భన్సల్, బీజేపీ తరపున బాలీవుడ్ నటి కిరణ్ ఖేర్, మరో సినీతార గుల్ పనాగ్ ఆమ్ ఆద్మీ పార్టీ తరపున రంగంలో ఉన్నారు.