హవ్వా.. వీళ్లా ఇంటర్ టాపర్లు!
పాట్నా: 'రాజనీతి శాస్త్రం వంటలు చేయడం గురించి నేర్పిస్తుందట. ఇక నీళ్లకు హెచ్2వోకు చాలా బేధాలున్నాయట' ఈ మాటలు మొన్న బిహార్లో వెల్లడించిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో టాప్ వచ్చిన విద్యార్థులు చెప్పిన సమాధానాలు. దీంతో వారికి మరోసారి పరీక్షలు పెట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. బిహార్లో ఇటీవల పన్నెండో తరగతి పరీక్ష ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. అందులో రూబీ రాయ్(17) అనే విద్యార్థి ఆర్ట్స్ విభాగంలో టాపర్.
అలాగే మరో విద్యార్థి జూనియర్ లెవల్లో టాపర్. వీరిద్దరిని స్థానిక మీడియా ఒకటి ఇంటర్వ్యూ చేసింది. ఇందులో రూబీని పాలిటిక్స్ గురించి ప్రశ్నించగా.. వంట చేయడం గురించి చెబుతుందని, మరో జూనియర్ విద్యార్థి హెచ్ టూ వో, నీళ్లు గురించి అడిగితే తెలియదని చెప్పడంతో వాళ్లు అవాక్కయ్యారు. ఇలాంటి వారు మొత్తం పదిమంది టాపర్లను ప్రశ్నించినా ఇలాంటి సమాధానాలే చెప్పడంతో ఆ వివరాలు బయటకొచ్చాయి. దీంతో ఆ పదిమంది విద్యార్థులకు వచ్చే వారంలో మళ్లీ పరీక్ష పెట్టేందుకు బిహార్ అధికారులు సిద్ధమయ్యారు. కాగా, ఇక్కడ హాజీపూర్లోని వీన్ రాయ్ అనే కాలేజీకి చెందిన విద్యార్థులే అధికంగా చీటింగ్ పాల్పడ్డారని విద్యాశాఖ అధికారులు చెప్పారు.