ఆ కుటుంబమే అడ్డుకుంటోంది
ఓటమితో కాంగ్రెస్ ప్రతీకార రాజకీయాలు: మోదీ
♦ అస్సాంలో బీజేపీకి ఒక్క అవకాశమివ్వండి
♦ త్వరలో ఎన్నికలు జరగనున్న అస్సాంలో మోదీ ప్రచార ప్రసంగం
మోరన్/దిబ్రూఘర్(అస్సాం): మరో రెండు వారాల తరువాత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. విపక్ష కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. 2014 ఎన్నికల్లో ఓటమికి పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడం ద్వారా కాంగ్రెస్ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోందని ఆరోపించారు. సభను అడ్డుకోవడం ద్వారా పేదల సంక్షేమానికి సంబంధించిన పలు బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయన్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాంలో శుక్రవారం ఎన్నికల ప్రచార సభను తలపించేలా మోదీ ప్రసంగించారు.
మోరాన్‌లోని తేయాకు కార్మికులనుద్దేశించి ప్రసంగిస్తూ.. సోనియా గాంధీ కుటుంబం పేరును ప్రత్యేకంగా ప్రస్తావించకుండా.. కాంగ్రెస్ పార్టీలోని మొదటి కుటుంబం ప్రతికూల, అవరోధ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. ఆ ఒక్క కుటుంబం తప్ప.. తనను, ప్రభుత్వాన్ని, బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా పార్లమెంటు సజావుగా సాగాలనే కోరుకుంటున్నాయన్నారు. ‘2014 ఎన్నికల్లో 400 స్థానాల నుంచి 40 స్థానాలకు పడిపోయినవారు.. మోదీని పనిచేయనివ్వొద్దని, అడ్డంకులు, అవరోధాలు సృష్టించాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌ను అధికారానికి దూరం చేసిన పేదలు, కార్మికులపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నారు.
అందుకే పేదల సంక్షేమానికి, దేశాభివృద్ధికి ఉద్దేశించిన బిల్లులను అడ్డుకుంటున్నారు’ అని ధ్వజమెత్తారు. కార్మికుల బోనస్ పరిమితి పెంపు, బ్రహ్మపుత్ర నదిపై జలరవాణాకు ఉద్దేశించిన బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇలాంటి ప్రతికూల రాజకీయాల వల్ల అంతిమంగా నష్టపోయేది ప్రజలు, దేశమేనన్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీని గెలిపించాలని తేయాకు కార్మికులను కోరారు. కేంద్రంతో సానుకూలంగా వ్యవహరించే ప్రభుత్వం రాష్ట్రంలో ఉంటే రాష్ట్రాభివృద్ధికి మరింత అవకాశం లభిస్తుందన్నారు.
మళ్లీ చాయ్‌వాలా ప్రస్తావన..
తేయాకు కార్మికుల సభలో.. గతంలో తాను రైల్వే స్టేషన్లో టీలమ్మిన విషయాన్ని మోదీ మరోసారి గుర్తు చేసుకున్నారు. తోటల్లో మీ కృషి వల్ల అస్సాం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. నేను గతంలో టీ అమ్మి జీవనభృతి సంపాదించుకున్నా’ అన్నారు. తేయాకు కార్మికుల సంక్షేమాన్ని ఇన్నాళ్లూ ప్రభుత్వాలు పట్టించుకోలేదని, బీజేపీకి ఒక అవకాశం ఇస్తే ఈ పరిస్థితిని మారుస్తామన్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి, కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. ‘సర్బానంద అంటే సర్వులకూ ఆనందం అని అర్థం. ఆయనకు అవకాశమిస్తే అందరికీ ఆనందం కలిగిస్తారు’ అంటూ మోదీ చమత్కరించారు.
బీసీపీఎల్ జాతికి అంకితం
లెపట్కట(అస్సాం): ఈశాన్య రాష్ట్రాలకు సరికొత్త అభివృద్ధి నమూనా అవసరమని మోదీ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ‘యాక్ట్ ఈస్ట్’ విధానంలో భాగంగా థాయ్‌లాండ్, సింగపూర్, మలేసియా, ఇండోనేసియా, మయన్మార్ తదితర పొరుగు దేశాలతో కలిసి ఈ ప్రాంత ఉమ్మడి సామర్థ్యాలను ఫలవంతం చేసుకునే దిశగా ఆ నమూనా ఉండాలన్నారు. తూర్పు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి తన ప్రభుత్వ ప్రాథమ్యమని స్పష్టం చేశారు. అస్సాంలో బ్రహ్మపుత్ర క్రాకర్ పాలీమర్ లిమిటెడ్(బీసీపీఎల్)ను, నుమాలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్‌కు చెందిన వ్యాక్స్ ప్లాంట్‌ను శుక్రవారం మోదీ జాతికి అంకితం చేశారు. . ఈ రెండు ప్రాజెక్టులు ప్రారంభం కావడం దేశ ప్రగతి యాత్రకు దారి తీస్తుందన్నారు. ‘25 ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్టులు ప్రారంభమై ఉంటే.. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధించేది. ఒక తరం ప్రజలు ఇప్పటికే ఆ అభివృద్ధి ఫలాలను అందుకుని ఉండేవారు’ అని అన్యాపదేశంగా గత ప్రభుత్వాల వైఫల్యాన్ని ఎండగట్టారు. తూర్పు, ఈశాన్య ప్రాంతాలు వెనకబడి ఉంటే.. దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యం కాదన్నారు.