బెంగళూరు : ఎన్నికల రాష్ట్రం కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ తాయిలాలు ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 6.2లక్షల మంది ఉద్యోగుల వేతనాలను 30 శాతం పెంచాలన్న ప్రతిపాదనకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య త్వరలోనే ఆమోదం తెలుపనున్నారు. జీతాల పెంపుతోపాటు నాలుగో శనివారాన్ని సెలవు దినంగా ప్రకటించనున్నారు. ఫిబ్రవరిలో జరుగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ఈ మేరకు ప్రకటన వెలువడనున్నట్లు తెలిసింది.
చిన్న మెలిక : జీతాల పెంపు ద్వారా ప్రభుత్వ ఖజానాపై సుమారు రూ.10,800 కోట్ల అదనపుభారం పడుతుందని, అయినాసరే పెంపునకు వెనుకాడబోమని రాష్ట్ర మంత్రులు చెబుతున్నారు. అయితే, నాలుగో శనివారం సెలవుపై మాత్రం ప్రభుత్వం చిన్న మెలికపెట్టింది. నెలలో పని గంటలు తక్కువ కాకుండా ఉండేలా.. మొదటి, మూడో శనివారాల్లో ఉద్యోగులు అదనంగా పనిచేయాల్సిఉంటుంది.
జనవరి 31 డెడ్‌లైన్ : జీతాల పెంపు అంశంపై గత బడ్జెట్ సెషన్‌లో సీఎం సిద్ధూ చెప్పిన మాట ప్రకారం.. రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనివాస మూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటుచేశారు. జీతాల పెంపు ఎంత శాతం ఉండాలనేదానిపై మూర్తి కమిటీ సిఫార్సు చేయనుంది. ‘‘మా నివేదిక దాదాపు పూర్తయింది. జనవరి 31 డెడ్‌లైన్ అని సీఎం చెప్పారు. కాబట్టి ఒకటి రెండు రోజుల్లో నివేదికను అందజేస్తాం’ అని శ్రీనివాసమూర్తి చెప్పారు. కాగా, ఉద్యోగ సంఘాలు మాత్రం 30 నుంచి 35 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment