
పరిష్కారానికి కేంద్రాన్ని ఆదేశించండి
- కశ్మీర్‌లో పరిస్థితులపై రాష్ట్రపతిని కోరిన జమ్మూకశ్మీర్ ప్రతిపక్షాలు
- ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో ప్రణబ్ ముఖర్జీతో సమావేశం
న్యూఢిల్లీ : కశ్మీర్‌లో శాంతిని నెలకొల్పేలా రాజకీయ పరిష్కారానికి కేంద్రాన్ని ఆదేశించాలని కశ్మీర్‌కు చెందిన ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రపతిను కోరాయి. కశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ప్రతిపక్షాల ప్రతినిధుల బృందం శనివారం రాష్ట్రపతి ప్రణబ్‌ను కలిసింది. శాంతి నెలకొల్పేలా కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ప్రణబ్‌కు ఒక మెమొరాండంను అందజేసింది. రాష్ట్రపతి తన విచక్షణాధికారాలను ఉపయోగించి.. కశ్మీర్‌లో సామాన్యులపై భద్రతా దళాలు కాల్పులకు తెగబడకుండా చర్యలు తీసుకోవాలని కోరినట్టు అనంతరం మీడియాతో ఒమర్ చెప్పారు. కశ్మీర్ సమస్య రాజకీయపరమైనదని, దీనిని పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా అన్ని వర్గాలతో చర్చల ప్రక్రియను ప్రారంభించడం ద్వారా సమస్యకు రాజకీయ పరిష్కారం చూపేలా చొరవ తీసుకోవాలని రాష్ట్రపతిని కోరినట్టు చెప్పారు. రాష్ట్రంలో స్థిరత్వం, శాంతి సుదీర్ఘకాలం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
అశాంతి పాక్ సృష్టే: రాజ్‌నాథ్
షాజహాన్‌పూర్: కశ్మీర్‌లో కొనసాగుతున్న అశాంతికి పాకిస్తానే కారణమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆరోపించారు. ఆయన శనివారం ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ‘తిరంగా ర్యాలీ’ని ప్రారంభించి ప్రసంగించారు. ‘‘ఇటీవల నేను పాక్ వెళ్లాను.. మన పొరుగు దేశం తప్పుడు పనులు మీకందరికీ తెలుసు. అక్కడ ఏం జరిగిందనేది నేను మళ్లీ చెప్పదలచుకోలేదు. కానీ.. భారత ప్రతిష్ట తగ్గకుండా చేశానని చెప్పదలచుకున్నాను. ఒక దేశపు ఉగ్రవాది మరొక దేశానికి హీరో కాలేడని చెప్పాను’’ అని పేర్కొన్నారు. కశ్మీరీ ప్రజల చేతుల్లో రాళ్లు, ఇటుకలు, తుపాకులు కాకుండా పెన్నులు, కంప్యూటర్లు, ఉద్యోగాలు చూడదలచుకున్నట్లు చెప్పారు.
టీన్స్ కోసం ఫేస్‌బుక్ యాప్‘ లైఫ్‌స్టేజ్’
న్యూయార్క్: హైస్కూల్ విద్యార్థుల కోసం ‘లైఫ్‌స్టేజ్’ పేరుతో ఫేస్‌బుక్ కొత్త ఐఓఎస్ యాప్‌ను ప్రారంభించింది. వీడియో లైక్‌లు, స్నేహితుల అభిరుచులు, సంతోషం, బాధ కలిగించిన సందర్భాలు తదితర వివరాలను వర్చువల్ ప్రొఫైల్ వీడియోగా మార్చి ఈ నెట్‌వర్క్‌లోని ఇతర విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారు.
అది విమాన శకలమేనా..?
సాక్షి, చెన్నై: కొద్ది రోజుల క్రితం గల్లంతైన ఏఎన్-32 విమానం కోసం జరుగుతున్న గాలింపు చర్యల్లో భాగంగా సముద్ర గర్భంలో ఓ వస్తువు కనిపించినట్లు సమాచారం. విమాన శకలమయ్యుండొచ్చనే వార్తల నేపథ్యంలో 3.5 కి.మీల లోతులో ఉన్న ఆ వస్తువు ఏమిటన్న పరిశోధనను తీవ్రం చేశారు.