మేం చెప్పేది చేయవా అంటూ దారుణం
పాలన్పూర్: గుజరాత్ లో మరోసారి గోవు వివాదం రగులుకుంది. తమ పొలంలో చనిపోయిన గోవు కళేబరాన్ని తీసేందుకు నిరాకరించిన ఓ దళిత గర్భిణీ స్త్రీ, ఆమె భర్త, మరో వ్యక్తిపై కొందరు అగ్రకులస్తులు దాడి చేశారు. వారిని తీవ్రంగా గాయపరచడంతో ఆస్పత్రి పాలయ్యారు. గుజరాత్ లోని బనస్కంత జిల్లాలోని అమిర్ గఢ్ తాలుగా కర్జా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కర్జా అనే గ్రామంలో సంగీత రణవాసియా(25), నిలేశ్ రనవాసియా అనే ఇద్దరు భార్యభర్తలు. వీరు దళితులు.
దర్బార్ అనే కమ్యూనిటికీ చెందిన అగ్రకులస్తులు తమ పొలంలో ఆవు చనిపోయిందని, దాని కళేబరాన్ని తీసి పారేసేందుకు రావాలని రనవాసియాను వారు అడిగారు. అయితే, ఇప్పుడు తాము ఆ పనిచేయడం లేదని బదులిచ్చారు. తాము చెప్పిన మాట వినవా అంటూ ఓ పదిమంది అతడిపై దాడి చేస్తుండగా ఐదునెలల గర్భవతి అయిన సంగీత అడ్డుపడబోయింది. దీంతో ఆమెపై కూడా చేయిచేసుకున్నారు. అడ్డొచ్చిన మరో ఆరుగురిపైనా దాడి చేశారు. దీంతో వారంతా ఆస్పత్రి పాలవ్వాల్సి వచ్చింది. దాడి చేసిన వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నారు.