భువనేశ్వర్ : వయసులో ఉన్న యువతీ, యువకులు ప్రేమలో మునిగితేలడం ఆ తరువాత అమ్మాయి గర్భవతి కావడం మోసం చేశాడంటూ కోర్టుకు ఎక్కడం వంటి కేసులను తరచుగా చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి ఘటనే తాజాగా ఒడిశాలో చోటుచేసుకోగా.. దానిపై ఆ రాష్ట్ర హైకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. పెళ్లి చేసుకుంటానని ప్రలోభ పెట్టి, శారీరక కలయిక అనంతరం యువతి గర్భం దాలిస్తే దానిని రేప్ (ఐపీసీ 376 అత్యాచారం)గా పరిగణించలేమని న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాల ప్రకారం కొరాపుట్ జిల్లా పొట్టంగి పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో ఓ కేసు నమోదైంది.
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేళ్ల పాటు తనతో శారీరక సంబంధం కొనసాగించాడని ఆ యువతి పిటిషన్‌లో పేర్కొంది. ఈ క్రమంలోనే రెండు సార్లు గర్భందాల్చానని, పెళ్లి చేసుకోమ్మని అడిగితే ముఖం చాటేశాడని ఫిర్యాదులో తెలిపింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని జైలుకు పంపించారు. ఈ క్రమంలోనే నిందితుడు గత ఆరు నెలలుగా జైల్లో ఉంటున్నారు. దీనిపై నిందితుడు హైకోర్టు ఆశ్రయించగా.. శనివారం ఒడిశా హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
న్యాయమూర్తి ఎస్కే పాణిగ్రహి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును చెబుతూ.. ‘ఇటీవల కాలంలో కొంతమంది యువతీ యువకులు ప్రేమలో మునిగితేలుతున్నారు. వారిలో కొందరు యువకులు పెళ్లి చేసుకుంటామని నమ్మించి ప్రియురాళ్ళతో ముందుగానే శారీరక సుఖం పొందుతున్నారు. ఆ తర్వాత పెళ్లికి నిరాకరించడంతో యువతులు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. అయితే ఇలాంటి వాటిని లైంగిక దాడి కేసులుగా భావించలేం’ అని 12 పేజీల తీర్పులో ప్రతిలో పేర్కొన్నారు. దీంతో జైల్లో ఉన్న యువకుడికి కేసు నుంచి ఉపశమనం కలిగింది.
Comments
Please login to add a commentAdd a comment