ప్రతీకాత్మక చిత్రం
మాది లవ్ మ్యారేజ్. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కూడా. మా అత్తగారింటి వాళ్లు డిమాండ్ చేయడంతో బంగారు, డబ్బు కట్నంగా ఇచ్చారు మా పేరెంట్స్. మా పెళ్లి 2016 ఆగస్టులో జరిగింది. నవంబర్ లో గర్భం దాల్చాను. పెళ్లయినప్పటి నుంచి నా భర్త, అత్తింటివారు నన్ను మా క్యాస్ట్ గురించి చాలా వేధించేవారు. ప్రెగ్నెంట్‌ని అని కూడా చూడకుండా ఆ వేధింపులు కొనసాగాయి. ఎనిమిదవ నెలలో నన్ను ‘నీ పుట్టింటికి వెళ్లి సీమంతం చేయించుకో’ అని పంపించారు. మరో పది లక్షల కట్నం తీసుకురమ్మన్నారు. నా బిడ్డకు ఎనిమిది నెలలు వచ్చినా అత్తింటి వాళ్లొచ్చి నన్ను తీసుకువెళ్లలేదు. నేనే వెళ్తే కొట్టి పంపించేశారు. నా భర్త బ్యాంకు ఉద్యోగి. ‘డొమెస్టిక్ వయోలెన్స్ అండ్ డౌరీ కేస్ వేసినా ఏం చేయలేరు, నా జాబ్ కూడా ఎఫెక్ట్ అవ్వదు. మిమ్మల్ని చంపుతా’ అని బెదిరిస్తున్నాడు. నా వైవాహిక జీవితం అంతా భరించలేని వేధింపులే. కొట్టడం, తిట్టడం, అన్నం పెట్టకపోవడం... చెప్పుకుంటూ పోతే ఎన్నో. మా పేరెంట్స్ దగ్గరకు ఓ సారి రౌడీలు వచ్చి బెదిరించారు. నా భర్త, అతని సోదరుడు, అత్తగారు, ఆడపడుచు అందరూ కలిసి కొట్టేవారు. నా పరిస్థితిని అర్థం చేసుకుని నాకు సజెషన్ ఇవ్వండి. ప్లీజ్.
– శ్రీ, ఈ మెయిల్
ఈ స్థితిలో ఆ వైవాహిక బంధాన్ని కొనసాగించడం కష్టమే. తాత్కాలిక కోపం, చిరాకు పడడం వంటి వాటిని అయితే సర్దుకుపోవడం, అర్థమయ్యేలా చెప్పడం వంటి ప్రయత్నాలతో పరిష్కరించుకోవచ్చు. మీరు చెప్తున్న వివరాలు చూస్తే... మీరు నిర్ణయం తీసుకోక తప్పదనిపిస్తోంది. ముందుగా హెరాస్‌మెంట్, డొమెస్టిక్ వయొలెన్స్‌ల నుంచి బయటపడానికి ఐపిసి సెక్షన్ 498ఎ, సెక్షన్ 406ల కింద కేసు నమోదు చేయాలి. క్యాస్ట్‌ను కించపరుస్తూ వేధిస్తున్నట్లు కూడా చెప్పారు. కానీ మీరిచ్చిన వివరాల ప్రకారం ఎస్‌సి అండ్ ఎస్‌టి (ప్రివెన్షన్) అట్రాసిటీస్ యాక్ట్ పరిధిలోకి వస్తారో రారో తెలియడం లేదు. ఒకవేళ వర్తించేటట్లయితే వాటి కింద కూడా కేసు నమోదు చేయవచ్చు. విడాకులు, భరణం కోరుతూ మరో కేస్ ఫైల్ చేయాలి. అలాగే మీ క్వాలిఫికేషన్ తెలిస్తే మరికొంత సహకారం అందించగలుగుతాం. ఎందుకంటే పై వన్నీ తేలే వరకు మీరు పుట్టింటి వాళ్ల మీద ఆధారపడి ఉండాల్సి రావడం కష్టమే. మీ కంటూ సంపాదన ఉండాలి. మీ కాళ్ల మీద మీరు నిలబడడం చాలా ముఖ్యం. మీ వివరాలు తెలియచేస్తే మీరు చేయగలిగిన ఉద్యోగావకాశాలు ఎక్కడ ఉన్నాయో గైడ్ చేయగలుగుతాం.
– బులుసు విజయలక్ష్మి, సాయి సేవా సంఘ్ ట్రస్ట్
మాకు పంపండి: ఒక మహిళగా మీరు గృహహింస వంటి వేధింపులకు గానీ, సామాజికంగా వివక్షకుగానీ లేదా సంబంధిత ఇతర సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యను రాసి మాకు మెయిల్ ద్వారా పంపించండి.ఆయా రంగాలకు చెందిన నిపుణులతో మీకు తగిన సూచనలు / సలహాలు ఇప్పించే ఏర్పాటు చేస్తాం. మీరు మీ ప్రశ్నలను పంపాల్సిన మెయిల్ ఐడీ : nenusakthiquestions@gmail.com
Comments
Please login to add a commentAdd a comment