పెళ్లి పేరుతో బాలికను గర్భవతిని చేసి ...
జయపురం: పెళ్లి పేరుతో బాలికను మభ్యపెట్టి గర్భవతిని చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి పెద్దతల్లి జయపురం మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని వైద్యపరీక్షలకు తరలించారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..
జయపురం సమితి తారాగాం గ్రామానికి చెందిన బాలిక తల్లి కొంతకాలం కిందట మృతి చెందింది. తండ్రి ఎటో వెళ్లిపోయాడు. ఆ బాలిక పనులు చేసి ఐదేళ్ల తమ్ముడిని పోషిస్తోంది. అదే గ్రామానికి చెందిన మందన నాయక్ బాలికను మభ్యపెట్టి లొంగదీసుకున్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. భయపడిన బాలిక ఎవరికీ చెప్పలేదు. 15 రోజుల కిందట ఆ బాలిక అనారోగ్యానికి గురవడంతో బంధువులు కుమిలిపుట్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు.
వైద్యపరీక్షల్లో బాలిక ఆరు నెలల గర్భిణి అని తెలిసింది. దీంతో బాలిక ఏం జరిగిందో బంధువులకు తెలిపింది. ఈ విషయాన్ని ఆమె తండ్రి గ్రామపెద్దలకు తెలిపాడు. గ్రామపెద్దలు నిలదీయడంతో తాను చేసిన తప్పును మందన నాయక్ అంగీకరించారు. బాధితురాలు గర్భిణీ కాబట్టి ఆమెను వివాహం చేసుకోవాలని పెద్దలు చెప్పగా అందుకు ఆతడు అంగీకరించాడు.
అతనికి భార్య, ఆరుగురు పిల్లలు ఉన్నారు. దీంతో అతడి భార్య మరో పెళ్లికి అంగీకరించలేదు. మూడు దినాల కిందట బాలిక తండ్రి చనిపోవడం తో తమ్ముడితో కలిసి పెదనాన్న ఇంటికి చేరింది. బాధితురాలి పెద్దమ్మ ఫిర్యాదు మేరకు నిందితుడిని జయపురం మహిళా పోలీసులు అరెస్టు చేశారు.