కొత్తగా ఆరు ఐఐటీలు
న్యూఢిల్లీ: అత్యున్నత ప్రమాణాలతో సాగే బోధనకు మారుపేరుగా చెప్పుకునే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లు మరో ఆరు ఏర్పాటు కాబోతున్నాయి. ఇందుకు సంబంధించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చట్టం-2016కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆమోదం తెలిపారు. ధన్‌బాద్‌లో ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్(ఐఎస్‌ఎం)ను కూడా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీగా పేరు మార్చనున్నట్లు చట్టంలో స్పష్టంచేశారు.
జమ్మూ, తిరుపతి (ఆంధ్రప్రదేశ్), పలకాడ్ (కేరళ), గోవా, ధర్వాడ్ (కర్నాటక), బిలాయ్ (చత్తీస్‌గఢ్)లలో కొత్తగా ఐఐటీలను ఏర్పాటు చేయనున్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చట్టం-2016కు జూలై 25న లోక్‌సభ ఆమోదం పొందగా, ఆగస్టు 2న రాజ్యసభ ఆమోదం పొందింది. తాజాగా ఈ చట్టానికి రాష్ట్రపతి ఆమోదం కూడా లభించింది. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీని కూడా ఏర్పాటు చేస్తారు. జాతీయస్థాయిలో విద్యాప్రమాణాలు పెంపొం దించేందుకు ఈ చట్టాన్ని తీసుకువచ్చారు.