తాడేపల్లిగూడెం: రాష్ట్రంలో ఇసుక మాఫియా సూత్రధారులు తెలుగు తమ్ముళ్లేనని ఆంధ్రప్రదేశ్ లోక్‌సత్తా అధ్యక్షుడు డీవీవీఎస్ వర్మ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ఇసుక దందా ద్వారా 35 మంది టీడీపీ ఎమ్మెల్యేలు రూ. 2 వేల కోట్ల వరకు దండుకున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో 400 మండలాలు కరువుతో అల్లాడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. కరువు మండలాల్లో రుణమాఫీ పథకాన్ని పూర్తిగా అమలు చేయాలని కోరారు.
రైతులను ఆత్మహత్యలు చేసుకోవద్దని ప్రభుత్వం చెబుతోందే తప్ప.. నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని విషజ్వరాలు వణికిస్తున్నాయని, ఏజెన్సీ ప్రాంతాల్లో తీవ్రరూపం దాల్చాయని అన్నారు. పరిస్థితి ఇలా ఉంటే ఆరోగ్య శాఖ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎలుకలు కూడా పట్టలేని స్థితికి వచ్చిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల హాస్టళ్లు పోలీసు లాకప్‌ల మాదిరిగా తయారయ్యాయన్నారు.
అమరావతిలో స్వప్రయోజనాల కోసం స్థలాల లీజు గడువును 33 సంవత్సరాల నుంచి 99 ఏళ్లకు పెంచడం సరికాదన్నారు. రాజధాని అవసరమేనని.. అయితే, అభివద్ది ఒకేచోట కేంద్రీకృతం కాకూడదని పేర్కొన్నారు. అభివృద్ధి అన్ని జిల్లాల్లో జరగాలని అభిప్రాయపడ్డారు. ఇదే నినాదంతో ఈ నెల 22న ఒంగోలులో రాష్ట్రస్థాయి సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. ఏడాదిన్నర కాలంగా రాయలసీమను తాగునీటి సమస్య పట్టిపీడిస్తోందని, అక్కడి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు. రాష్ట్రం నుంచి పనుల కోసం వలసలు పోయే పరిస్థితిని నివారించాలన్నారు.