సొంతవాళ్లకు అంతులేని ప్రయోజనాలా? | ysrcp leader vasireddy padma fires on chandrababu government | Sakshi
Sakshi News home page

సొంతవాళ్లకు అంతులేని ప్రయోజనాలా?

Published Mon, Dec 28 2015 3:55 AM | Last Updated on Thu, Sep 13 2018 5:22 PM

సొంతవాళ్లకు అంతులేని ప్రయోజనాలా? - Sakshi

సొంతవాళ్లకు అంతులేని ప్రయోజనాలా?

♦ ఆప్టిక్ ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలి
♦ చంద్రబాబు తన బినామీలకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారు
♦ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజం
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అందులో సొంతవాళ్లకు అంతులేని ప్రయోజనాలను చేకూరుస్తోందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. తాజాగా టెరా సాఫ్ట్‌వేర్ కంపెనీ లిమిటెడ్‌కు ఇచ్చిన రూ.333 కోట్ల ఆప్టిక్ ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆమె ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పారదర్శకత గురించి ఎక్కువగా చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ తన బినామీలకు మేలు చేస్తున్నారని విమర్శించారు.

గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని చెబుతూ ఈ ప్రాజెక్టును సీఎం సొంత మనిషి వేమూరి హరికృష్ణకు చెందిన సోదర సంస్థ టెరా సాఫ్ట్‌వేర్ కంపెనీ లిమిటెడ్‌కు అప్పగించారని పేర్కొన్నారు. టీడీపీకి ఐటీ సలహాదారు అయిన హరికృష్ణ ఇప్పటికే ఏపీ ప్రభుత్వంలోని మూడు సంస్థల్లో డెరైక్టర్‌గా ఉన్నారని, చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌తో కూడా అనుబంధం ఉందని, అలాంటి వ్యక్తికి ఈ కాంట్రాక్ట్‌ను కట్టబెట్టడం ఏమిటని ప్రశ్నించారు. టెరా సంస్థ చౌక దుకాణాలకు ఈ-పాస్ యంత్రాలను సరఫరా చేసే కాంట్రాక్ట్‌ను తీసుకొని వైఫల్యం చెందడంతో బ్లాక్‌లిస్టులో ఉందని వాసిరెడ్డి పద్మ గుర్తుచేశారు. గతంలో ఈవీఎంలు దొంగిలించిన కేసులో మహారాష్ట్రలో హరికృష్ణ నిందితుడు అని చెప్పారు. ఫైబర్ గ్రిడ్ కాంట్రాక్ట్‌ను ఎవరికి అప్పగించాలో నిర్ధారించే కమిటీలో హరికృష్ణ ఒక సభ్యుడని పేర్కొన్నారు. ‘‘కాంట్రాక్టులు ఎవరికి ఇవ్వాలో నిర్ణయించేది వారే. దక్కించుకునేది వారే’’ అన్న పద్ధతిలో చంద్రబాబు పాలన సాగుతోందని దుయ్యబట్టారు.

 బినామీలకు అనుకూలంగా నిర్ణయాలు
 చక్కెర ఫ్యాక్టరీలను ప్రైవేటీకరించే కమిటీలో సీఎం సొంత మనిషి, మధుకాన్ షుగర్స్ అధినేత నామా నాగేశ్వరరావు, విద్యా సంస్థలకు సంబంధించిన కమిటీల్లో మంత్రి నారాయణ, ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావులే ఉంటారని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. సహజంగానే వారిద్దరూ నారాయణ విద్యాసంస్థలకు మేలు చేసే నిర్ణయాలే తీసుకుంటారని అన్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సహా ఆయా కమిటీల్లో నియమితులయ్యే మంత్రులంతా బినామీల ద్వారా వ్యాపారాలు చేసుకునే వారేనని, వీరు తీసుకునే నిర్ణయాలు బినామీలకు అనుకూలంగానే ఉంటాయని ఆరోపించారు. న్యాయమూర్తులు సైతం తమకు సంబంధం ఉన్న కేసుల ను విచారించడానికి నిరాకరిస్తారని, చంద్రబాబు ప్రభుత్వం అలాంటిది కూడా పాటించడం లేదన్నారు. సమాజం ఏమనుకుంటుందో, జనం ఏమనుకుంటారోనన్న బెరుకు లేకుండా చంద్రబాబు రాష్ట్రాన్ని తన మనుషులకు దోచి పెడుతున్నారని ఆమె మండిపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement