రాజకీయ కక్షతోనే విష్ణును ఇరికించారు
విజయవాడ: చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాంగ్రెస్ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారనే కారణంతోనే కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని రఘువీరా మండిపడ్డారు. రాజకీయ కక్ష తోనే కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును కేసులో ఇరికించారని ఆయన మండిపడ్డారు. కల్తీ మద్యం ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం 20 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశామని చెప్పారు.
స్వర్ణ బార్‌లో జరిగిన మరణాలకు కల్తీ మద్యం కారణం కాదని రఘువీరా అన్నారు. విష ప్రయోగం వల్లే మరణాలు జరిగాయని చెప్పారు. విషం కలవడం వెనుక ప్రభుత్వం పాత్ర కూడా ఉందని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను పావులుగా వాడుకుంటోందని చెప్పారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. పుష్కరాల ఘటనలో చంద్రబాబును బాధ్యుడిగా ఎందుకు పేర్కొనలేదని అన్నారు. సీఎం క్రిమినల్ మైండ్‌తో వ్యవహరిస్తున్నారని రఘువీరా, కాంగ్రెస్ నేత సి. రామచంద్రయ్యలు విమర్శించారు.