
భూఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఓకే
కేంద్ర ప్రభుత్వం రెండోసారి తీసుకువచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు.
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రెండోసారి తీసుకువచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. లోక్‌సభలో చేసిన 9 సవరణలను తాజా ఆర్డినెన్స్‌లో పొందుపరిచారు. బడ్జెట్ తొలిదశ సమావేశాల్లో లోక్‌సభలో గట్టెక్కినా రాజ్యసభలో తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ఈ ఆర్డినెన్స్ ఆమోదం పొందలే కపోయింది. గత డిసెంబర్‌లో తీసుకువచ్చిన ఆర్డినెన్స్ గడువు శనివారంతో ముగియనుంది. దీంతో మళ్లీ ఆర్డినెన్స్ జారీ చేసేందుకు మార్చి 31న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సిఫారసు మేరకు శుక్రవారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆర్డినెన్స్‌పై సంతకం చేశారు. దీంతో మోదీ అధికారం చేపట్టాక జారీ అయిన ఆర్డినెన్స్‌ల సంఖ్య 11కు చేరింది. భూసేకరణ ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేసేందుకు వీలుగా ప్రభుత్వం కిందటివారమే రాజ్యసభను ప్రొరోగ్ చేసిన సంగతి తెలిసిందే.
ఆహార చట్టం అమలుక
6 నెలల గడువు పొడిగింపు
ఆహార భద్రత చట్టం అమలుకు కేంద్రం మరో ఆరు నెలల గడువు పొడిగించినట్లు కేంద్ర ఆహార శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ తెలిపారు. చట్టం అమలుకు ఇప్పటికే రెండుసార్లు గడువు పొడిగించారు. ఈనెల 4తో రెండో గడువూ ముగియనున్న నేపథ్యంలో మరో ఆరునెలలు పొడిగించడం గమనార్హం. ఇప్పటివరకు ఒక కేంద్రపాలిత ప్రాంతం, 10 రాష్ట్రాలు(పంజాబ్, హరియాణా, రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, చండీగఢ్) మాత్రమే దీన్ని అమలు చేస్తున్నాయి. ఈ చట్టం కింద దేశంలోని మూడింట రెండొంతుల జనాభాకు ఒక్కొక్కరికి నెలకు 5 కిలోల ఆహారధాన్యాలను రూ.1-3కే ఇవ్వాల్సి ఉంది. కాగా, రాష్ట్రాల్లో ఎక్కడా ఆహార ధాన్యాల నిల్వ సమస్య లేదని పాశ్వాన్ తెలిపారు.