
ముంబై : ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రుల దేశ, విదేశీ పర్యటనలకు ఐదేళ్లలో అయిన ఖర్చు మొత్తం ఎంతో తెలుసా? అక్షరాల రూ.393 కోట్లు. ఈమేరకు 2014, మే నుంచి ప్రధాని, కేంద్ర మంత్రులు దేశ, విదేశీ పర్యటనల నిమిత్తం ఎంత ఖర్చు చేశారని అనిల్ గల్గాలీ అనే సామాజిక కార్యకర్త ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) బదులిచ్చింది. 2014 జూన్ నుంచి మోదీ విదేశీ పర్యటనలకు అయిన మొత్తం రూ.2,021 కోట్లు అని రాజ్యసభలో గతేడాది అడిగిన ప్రశ్నకు మోదీ ప్రభుత్వం సమాధానమిచ్చింది. ఈ మొత్తం మోదీ విదేశీ పర్యటనల సమయంలో చార్టర్డ్ విమానాలు, విమానాల నిర్వహణ, హాట్‌లైన్ సదుపాయాల నిమిత్తం ఖర్చు చేసినట్లు పేర్కొంది.
అయితే ప్రభుత్వం చెప్పిన దానికి, పీఎంవో వెల్లడించిన ఖర్చుకు పొంతనలేకపోవడం గమనార్హం. ప్రధాని, ఆయన మంత్రులు విదేశీ పర్యటనల కోసం రూ.263 కోట్లు వెచ్చించగా, దేశీయ పర్యటనలకు రూ.48 కోట్లు ఖర్చు అయినట్లు ఆర్టీఐ పేర్కొంది. అలాగే సహాయ మంత్రుల విదేశీ పర్యటనలకు రూ.29 కోట్లు, దేశీయ పర్యటనలకు 53 కోట్లు వెచ్చించినట్లు తెలిపింది. 2014–15 ఏడాదిలో అత్యధికంగా ప్రధాని, మంత్రుల విదేశీ పర్యటనలకు రూ.88 కోట్లు ఖర్చయినట్లు పేర్కొంది. పీఎంఓ వెబ్‌సైట్ ప్రకారం 2014 మే నుంచి 2019, ఫిబ్రవరి 22 వరకు మోదీ 49 విదేశీ పర్యటనలు చేశారు. అలాగే ఈ అన్ని పర్యటనల్లో ఆయన చార్టర్డ్ విమానాలనే ఉపయోగించారు.
Comments
Please login to add a commentAdd a comment