సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ మే 17తో ముగియనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి మాట్లాడారు. లాక్‌డౌన్ మరింతకొంత కాలం పొడగింపు ఉంటుందని వెల్లడించారు. లాక్‌డౌన్ 4వ దశ ఉంటుందని, వివరాలు 18వ తేదీకి ముందే ప్రకటిస్తామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 42 లక్షల మందికి కరోనా సోకిందని, దాదాపు 2 లక్షల 75 వేల మంది మరణించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కరోనా మొత్తం ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేసిందని, తమ జీవితంలో ఎవరూ ఇలాంటి ఉపద్రవాన్ని కనీవిని ఎరుగరని మోదీ పేర్కొన్నారు. మానవజాతికి ఇది ఊహాతీతమని.. అలసిపోవద్దు, ఓడిపోవద్దు, కుంగిపోవద్దు, పోరాటంతోనే ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సంక్షోభం కంటే మన సంకల్పం గొప్పది అన్నారు.(70 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య)
‘ఈరోజు ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీని ప్రకటిస్తున్నాను. రూ. 20లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని ప్రకటిస్తున్నాను. ఇది మన జీడీపీలో 10శాతం. ఈ ఆర్థిక ప్యాకేజీలో అన్ని వర్గాల వారిని పరిగణలోకి తీసుకున్నాము. చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు, వ్యాపారులు, రైతులు.. ఉద్యోగులు శ్రామికుల్లో ఆత్మ స్థైర్యం నింపేందుకే ఈ ప్యాకేజీ. రేపటి నుంచి ఈ ప్యాకేజీకి సంబంధించి అన్ని వివరాలు ప్రకటిస్తాం’ అని మోదీ పేర్కొన్నారు.
‘ఈ యుద్దంలో ప్రతీ ఒక్కరు నియమ నిబంధనలను పాటించాలి. కరోనా కంటే ముందుగా ఉన్న ప్రపంచం ఏంటో మనకు తెలుసు. కరోనా సంక్షోభం తరువాత మారుతున్న ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. ఆత్మా నిర్భర్ భారత్... మన లక్ష్యం కావాలి. శాస్త్రాలు చెప్పింది కూడా ఇదే. కరోనా ప్రారంభం అయినప్పుడు, దేశంలో ఒక్క పీపీఈ కిట్ కూడా తయారయ్యేది కాదు. నేడు భారత్‌లో ప్రతీ రోజు 2లక్షల పీపీఈ కిట్స్, 2లక్షల ఎన్-95 మాస్క్‌లు తయారవుతున్నాయి. ఆపదను అవకాశంగా మార్చుకున్నాము. స్వయం సంవృద్ధి సాధించే దిశలో భారత్ వేగంగా ముందుకు పోతోంది. భారత సంస్కృతి, సాంప్రదాయం మన స్వయం సంవృద్ది గురించి చెబుతాయి. మొత్తం ప్రపంచాన్ని కుటుంబంగా చూసే సంస్కృతి మనది. ఈ భూమిని తల్లిగా భావించే ఆలోచన ఈ దేశానిది. అలాంటి మన దేశం స్వయం సంవృద్ది వైపు సాగితే. దీని ప్రభావం మొత్తం ప్రపంచానికి శుభపరిణామం’ అని మోదీ అన్నారు. (లాక్‌డౌన్ కొనసాగుతుంది.. అయితే)
సోమవారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని దృష్టికి సీఎంలు అనేక సమస్యలను తీసుకువచ్చారు. ఇక లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించడం ఇది మూడోసారి.(లాక్‌డౌన్ పొడగించాల్సిందేనట!)
Comments
Please login to add a commentAdd a comment