తాకట్టులో సార్వభౌమత్వం ప్రొఫెసర్ సాయిబాబా విమర్శ
న్యూఢిల్లీ: ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. ఆదీవాసీల కోసం పాటుపడేవారికి దేశవ్యతిరేకులుగా ముద్రవేస్తున్నారని, జైళ్లలో పెడుతున్నారని ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అన్నారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై జైలుశిక్ష అనుభవించి గతవారమే బెయిల్‌పై విడుదలైన సాయిబాబా.. ప్రభుత్వ దమనకాండ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మనకు నచ్చిన విషయాలు బహిర్గతంగా మాట్లాడలేం. ప్రతిచోటా బెదిరింపు వాతావరణమే కనబడుతోంది. ఇదే నియంతృత్వ ధోరణి’ అని సాయిబాబా అన్నారు. అధికారంలో ఉన్నవారు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను హరిస్తున్నారన్నారు.
దళితులు, ఆదీవాసీలకు సంబంధించిన కొన్ని కనీస అంశాలపై విద్యార్థులు, ప్రొఫెసర్లు ప్రశ్నలు లేవనెత్తారని.. జేఎన్‌యూ, హెచ్‌సీయూ, నిట్ శ్రీనగర్, ఐఐటీ మద్రాస్ గొడవలు అన్నింటికీ కారణం ఒకటేనన్నారు. రాజ్యాంగపరంగా దేశభక్తుడు అనే దానికి సరైన నిర్వచనం లేదని.. దేశంలోని చాలా సమస్యలపై చర్చను పక్కదారి పట్టించేందుకే ‘దేశవ్యతిరేకం’ అనే చర్చను తెరపైకి తెచ్చారన్నారు. ప్రభుత్వాలు దేశ సార్వభౌమత్వాన్ని సామ్రాజ్యవాదులకు తాకట్టుపెడుతున్నారని ఆరోపించారు. పర్యావరణాన్ని నాశనం చేస్తూ సహజవనరులను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని సాయిబాబా విమర్శించారు.