సాక్షి, ముంబై : తూర్పు, పశ్చిమ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ముంబైకర్లకు శుభవార్త. కొద్ది సంవత్సరాలుగా కాగితాలకే పరిమితమైన బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)-చునాబట్టి ప్రాంతాలను కలిపే ఫ్లై ఓవర్ ప్రతిపాదనకు త్వరలో మోక్షం లభించనుంది. ముంబైలో ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ కార్యాలయాలకు బీకేసీ ప్రధాన నిలయంగా మారింది. ఈ ప్రాంతం అతి తక్కువ సమయంలోనే ప్రసిద్ధి గాంచింది. ఇక్కడికి నిత్యం ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే వారి సంఖ్య దాదాపు లక్షాపైనే ఉంటుంది.
వీరి సౌకర్యార్థం బీకేసీ నుంచి చునాబట్టి వరకు పశ్చిమ-తూర్పు ప్రాంతాలను కలిపేందుకు 1.6 కి.మీ. ఫ్లై ఓవర్ నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆ మేరకు ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం మిఠీనది పరిసరాల్లో కేబుల్ సపోర్టుతో ఫ్లై ఓవర్ నిర్మించాల్సి ఉంది. అందుకు మొత్తం రూ.261 కోట్లు ఖర్చవుతాయని అంచనవేశారు. ఈ ప్రతిపాదన ఫైలు కొద్ది సంవత్సరాలుగా పడకేసింది. కానీ, మిఠీనది మధ్య భాగంలో ఒక పిల్లర్ వేసేందుకు కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పడకేసిన ఈ ఫైలు మళ్లీ తెరమీదకు వచ్చింది. ఈ పిల్లర్ కారణంగా ఈ ప్రాజెక్టుకయ్యే వ్యయం రూ.58 కోట్ల మేర తగ్గింది. మొత్తం రూ.203 కోట్లతో ఈ ప్రాజెక్టును పూర్తిచేస్తామని ముంబై ప్రాంతీయ అభివృద్థి సంస్థ (ఎమ్మెమ్మార్డీయే) స్పష్టం చేసింది.
ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఆరు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని ఎమ్మెమ్మార్డీయే అధికార వర్గాలు తెలిపాయి. మరో పదిహేను రోజుల్లో ఎమ్మెమ్మార్డీయే పూర్తిగా అధ్యయనం చేయనుంది. ఆ తర్వాత వర్క్ ఆర్డర్ జారీ చేయనుంది.
ఫ్లై ఓవర్ రూట్....
ఈ ఫ్లై ఓవర్ బీకేసీలోని జి-బ్లాక్ (డైమాండ్ బోర్స్ వెనక) నుంచి మహారాష్ట్ర నేచర్ పార్క్, ఎల్బీఎస్ రోడ్, సెంట్రల్ రైల్వే ట్రాక్ మీదుగా, సోమయ్య మైదానం సమీపంలో నుండి చునాబట్టి వరకు వెళుతుంది. అందుకు సెంట్రల్ రైల్వే పరిపాలన విభాగం కూడా ప్రాథమికంగా అనుమతి ఇచ్చింది.
టెండరు వేసిన ఐదు కంపెనీలు
ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు ఏడు కంపెనీలు సిద్ధంగా ఉన్నప్పటికీ ఐదు కంపెనీలు మాత్రమే టెండర్లు వేశాయి. ఇందులో గ్యామన్ ఇండియా, సింప్లెక్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, జే.కుమార్, ఎల్ అండ్ టీ, జేఎంసీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.
ఎస్‌సీఎల్‌ఆర్ వల్ల తగ్గిన ట్రాఫిక్
శాంతకృజ్-చెంబూర్ లింక్ రోడ్డు (ఎస్‌సీఎల్‌ఆర్) ప్రారంభం కావడంతో సైన్-ధారావి లింకు రోడ్డు, కలానగర్‌లో ట్రాఫిక్ జాం సమస్య కొంత తగ్గింది. బీకేసీ-చునాబట్లి ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే ట్రాఫిక్ జాం సమస్య పూర్తిగా తగ్గనుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, పారిశ్రామిక వేత్తల విలువైన సమయం, ఇందనం ఎంతో ఆదా కానుంది.
కాగితాల నుంచి నిర్మాణానికి..
Published Mon, Aug 4 2014 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM
Advertisement
Advertisement