ముంబైలో పెరిగిన పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగిపోవడంతో ఆ భారాన్ని పెట్రోలియం కంపెనీలు నేరుగా వినియోగదారులపై మోపుతున్నాయి. దీంతో పెట్రోల్ ధర మోత మోగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ. 75కు అటు-ఇటుగా ఉంటోంది. దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు ఇంచుమించు ఇదేరీతిలో ఉంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నా.. ప్రభుత్వాలు ఉపశమన చర్యలు తీసుకోకపోవడంపై ప్రతిక్షాలు మండిపడుతున్నాయి.
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ముంబైలో ఆందోళన నిర్వహించింది. కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు చేతిలో పళ్లెలను పట్టుకొని.. వాటిని మోగిస్తూ.. నిరసన తెలిపారు. ‘దేశంలోనే పెట్రోల్‌కు అత్యధిక ధర ఉన్నది ముంబైలోనే. గతంలో ఎప్పుడూ ఇంతటి ధరలు లేవు. ప్రధాని మోదీ పెట్రోల్ ధరలు తగ్గించాలి. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి’ అని కాంగ్రెస్ నేత సంజయ్ నిరూపమ్ అన్నారు.
(ముంబైలో పెరిగిన పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన)
ఇక, పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి వస్తే.. వీటి ధరలు తగ్గే అవకాశముందన్న వాదన ఉంది. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డగోలుగా వేస్తున్న పన్నులు, సుంకాల వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతున్న నేపథ్యంలో దేశమంతటా ఒకే పన్ను విధానాన్ని అవలంబించేందుకు ఉద్దేశించిన జీఎస్టీ పరిధిలోకి ఇవి వస్తే సామాన్యులకు కొంత ఊరట లభించే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంపై తమకు అభ్యంతరం లేదని పెట్రోలియం కంపెనీలు సైతం చెప్తున్నాయి.
(ముంబైలో పెరిగిన పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణుల ఆందోళన)
ఇలా చేయడం వల్ల పెట్రో పన్నుల ప్రక్రియ సులభతరం అవుతుందని అంటున్నాయి. ఈ విషయమై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ చైర్మన్ సంజీవ్ సింగ్ స్పందిస్తూ.. ‘పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే.. ఈ ప్రక్రియ సులభతరం అవుతోంది. ప్రతి ఒక్కరూ అన్ని ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవాలని కోరుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం అన్ని ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలో లేకపోవడం మాకు కొంత ప్రతికూలతగానే అనిపిస్తోంది’ అని పేర్కొన్నారు. మొత్తానికి పెట్రోలియం ఉత్పత్తులు జీఎస్టీ పరిధిలోకి తెస్తారా? లేదా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్‌గా కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment