
సాక్షి, న్యూఢిల్లీ : కుల ప్రాతిపదికన రిజర్వేషన్ల ను వ్యతిరేకిస్తూ పలు రిజర్వేషన్ వ్యతిరేక సంఘాల పిలుపు మేరకు మంగళవారం జరిగిన భారత్ బంద్‌కు మిశ్రమ స్పందన లభిస్తోంది. పలు రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆందోళనకారులు నిరసన చేపట్టగా, బిహార్‌లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్రం మీదుగా వెళ్లే రైళ్లను పలు చోట్ల నిలిపివేశారు. బీహార్‌లోని అరా నుంచి బయలుదేరిన రైలును దర్భాంగా వద్ద ఆందోళనకారులు అడ్డుకున్నారు. ఇక రాజస్ధాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో ముందు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.
సోషల్ మీడియా, వాట్సాప్‌ల ద్వారా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఏప్రిల్ 10న బంద్ పిలుపు ఇవ్వడంతో పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చడాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 2న దళిత సంఘాలు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. భారత్ బంద్ నిరసనల సందర్భంగా పది మంది మరణించగా, పలువురికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ చట్టంపై సుప్రీం తీర్పును పునఃసమీక్షించాలని దళిత సంఘాలు పట్టుబడుతున్నాయి.\
Comments
Please login to add a commentAdd a comment