ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంస
► సార్క్‌కు ఉపగ్రహాన్ని నిర్మిద్దాం
► అంతరిక్ష పరిజ్ఞానం ఫలాలు పొరుగు దేశాలకు అందిద్దాం
► అంతరిక్ష ప్రయోగాలతో సామాన్యుడి జీవితాన్ని మార్చొచ్చు
శ్రీహరికోట నుంచి సాక్షి ప్రతినిధి: స్వశక్తితో అంతరిక్ష రంగంలో తనదైన ముద్ర వేసుకున్న భారతదేశం మున్ముందు మరిన్ని ఎత్తులు అందుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆకాంక్షించారు. పేదరికం, ఉపాధి అవకాశాలు, ఆహార భద్రతలపై పోరాడుతున్న ఇరుగుపొరుగు దేశాలకు కూడా అంతరిక్ష పరిజ్ఞానం ఫలాలను అందించేందుకు ‘సార్క్’ ఉపగ్రహాన్ని నిర్మించాలని ఇస్రో శాస్త్రవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. సార్క్ సభ్యదేశాలకు భారత్ అందించే అతిగొప్ప కానుక ఇదే అవుతుందని ఆయన పేర్కొన్నారు. సోమవారం పీఎస్‌ఎల్‌వీ సీ23 ప్రయోగం విజయవంతమైన తర్వాత శ్రీహరికోటలోని షార్‌లో మిషన్ కంట్రోల్ రూం నుంచి ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఇచ్చిన స్ఫూర్తితో చందమామపైకి ఉపగ్రహాన్ని పంపగలిగామని గుర్తుచేశారు. ఇటీవల మార్స్ గురించి తీసిన హాలీవుడ్ సినిమా ‘గ్రావిటీ’కి అయిన ఖర్చు కంటే మనం ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్‌కు పెట్టిన ఖర్చు చాలా తక్కువేనని ప్రధాని చతురోక్తులు విసిరారు. అంగారకుడిపైకి ప్రయోగించిన ఉపగ్రహం కొన్ని నెలల్లోనే అక్కడికి చేరుకోబోతోందని చెప్పారు. ఈ ప్రయోగాల విజయాలతో భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. దాదాపు 26 నిమిషాల పాటు సాగిన ప్రధాని ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. కొంతసేపు ఇంగ్లిష్, మరికొంతసేపు హిందీలో ఆయన ప్రసంగించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
ఉపనిషత్‌ల నుంచి ఉపగ్రహాల దాకా...
‘‘సైకిల్ మీద రాకెట్‌ను తీసుకెళ్లి ప్రయోగించే స్థాయి నుంచి ప్రారంభమైన మన అంతరిక్ష ప్రయోగాలు వాణిజ్యపరంగా విజయాలు అందించే స్థాయికి చేరడం భారత జాతికే గర్వకారణం. భారతీయ సంస్కృతిలో అంతరిక్షంపై, గ్రహగతులపై లోతైన అవగాహన ఉంది. అందువల్లనే ఉపనిషత్తుల నుంచి ఉపగ్రహాల వరకూ దేశం ప్రస్థానం విజయవంతంగా సాగింది. ఈ దేశం వేల ఏళ్ల కిందటే ‘సున్నా’ను ప్రపంచానికి అందించింది. అదే లేకపోతే ప్రస్తుత విజ్ఞానం, ప్రగతి సాధ్యమయ్యే ప్రశ్నే ఉండేది కాదు. ఐదు దశాబ్దాల చరిత్రలో ఇస్రో వంద మైలురాళ్లను దాటి 71 ఉపగ్రహాలు, 43 ప్రయోగాలు కలిపి 114 ప్రయోగాలతో అద్భుతమైన విజయాలను నమోదు చేసింది.
సామాన్యుడి జీవితాన్ని మార్చే శక్తి ఉంది...
అంతరిక్ష రంగం సమాజంలోని ఉన్నత వర్గాల వారికోసమే అన్న అపోహ కొందరిలో ఉంది. కానీ ఈ రంగానికి సామాన్యుడి జీవితాన్ని మార్చే శక్తి ఉందన్న విషయాన్ని అందరూ గుర్తించాలి. జీఐఎస్ టెక్నాలజీ, స్పేస్ ఇమేజరీల ద్వారా మారుమూల కారడవుల్లో ఉన్న వారికి కూడా విద్య, వైద్యం అందించే అవకాశమేర్పడింది.
భూ రికార్డులకూ స్పేస్ టెక్నాలజీ
ఇస్రో శాస్త్రవేత్తలు జీపీఎస్ తరహాలో భారతీయ నావిగేషన్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నారు. మనె ఏడాది లోపు ఇది అందుబాటులోకి వచ్చే అవకాశముంది. శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేసి దేశంలోని భూమి తాలూకు రికార్డులన్నింటినీ స్పేస్ టెక్నాలజీ ద్వారానే సిద్ధం చేసేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయాలి.
మానవ వనరుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని యువతను అంతరిక్ష రంగంవైపు ఆకర్షితులను చేసేందుకు తగిన కార్యక్రమాలు రూపొందించాలి. ఇందుకోసం ఇంటరాక్టివ్ డిజిటల్ స్పేస్ మ్యూజియాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేయాలి’’ అని ప్రధాని తన ప్రసంగంలో సూచనలు చేశారు.
శాస్త్రవేత్తలతో ఉత్సాహంగా....
ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించిన అనంతరంకంట్రోల్ రూమ్‌లోని శాస్త్రవేత్తలను కలసి ముచ్చటించారు. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ సీనియర్ శాస్త్రవేత్తలను ఒకొక్కరిని పరిచయం చేయగా ప్రధాని వారితో కరచాలనం చేస్తూ నవ్వుతూ పలుకరించారు. పీఎస్‌ఎల్‌వీ ప్రయోగాన్ని వీక్షించేందుకు ఆదివారం సాయంత్రమే షార్‌కు చేరుకున్న ప్రధాని స్పేస్ టెక్నాలజీపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. రాత్రి 7:15 గంటల నుంచి షార్‌లోని పలు విభాగాలను సందర్శించి విశేషాలు తెలుసుకున్నారు. మొదట ప్రయోగవేదికపై నింగిలోకి ఎగిరేందుకు సిద్ధంగా ఉన్న పీఎస్‌ఎల్‌వీ సీ23, రెండో ప్రయోగ వేదికపై అనుసంధాన దశలో ఉన్న జీఎస్‌ఎల్‌వీ మార్క్-3 రాకెట్‌తో పాటు వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను పరిశీలించారు.
ప్రయోగం పూర్తయ్యాక చెన్నైకి
రాకెట్ ప్రయోగం ముగిసిన తర్వాత ఉదయం 10.30 గంటలకు నేరుగా హెలిప్యాడ్ వద్దకు వెళ్లిన ఆయన హెలికాప్టర్‌లో చెన్నైకి, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లారు. ప్రధానికి గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబుు, ఇస్రో రాధాకృష్ణన్, షార్ డెరైక్టర్ డాక్టర్ ఎం.వై.ఎస్.ప్రసాద్‌లు వీడ్కోలు పలికారు.
ఇస్రో విజయాలు జాతికి గర్వకారణం
Published Tue, Jul 1 2014 1:07 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement