పుదుచ్చేరి ‘హస్త’గతం... | Puducherry is Congress' consolation win | Sakshi
Sakshi News home page

పుదుచ్చేరి ‘హస్త’గతం...

Published Fri, May 20 2016 2:24 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

పుదుచ్చేరిలో కాంగ్రెస్ కూటమి గెలుపొందడంతో సంబరాలు చేసుకుంటున్న ఆ పార్టీ కార్యకర్తలు - Sakshi

పుదుచ్చేరిలో కాంగ్రెస్ కూటమి గెలుపొందడంతో సంబరాలు చేసుకుంటున్న ఆ పార్టీ కార్యకర్తలు

17 స్థానాల్లో గెలుపొందిన కాంగ్రెస్-డీఎంకే కూటమి
8 సీట్లతో సరిపెట్టుకున్న రంగసామి ఏఐఎన్‌ఆర్‌సీ
4 సెగ్మెంట్లలో అన్నాడీఎంకే, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి గెలుపు

పుదుచ్చేరి: కేరళ, అసోంలో అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఓదార్పు విజయం లభించింది. 30 మంది సభ్యులున్న పుదుచ్చేరి అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్-డీఎంకే కూటమి సాధారణ మెజారిటీని సాధించి అధికార పీఠం దక్కించుకుంది.

2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఎన్‌ఆర్‌సీ వ్యవస్థాపకుడు ఎన్. రంగసామి చేతిలో ఎదురైన పరాభవానికి ఇప్పుడు హస్తం పార్టీ ప్రతీకారం తీర్చుకుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెట్టిన రంగసామి అధికార పీఠం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి మాత్రం రంగసామి పార్టీ ఎనిమిది సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం 30 సీట్లకుగానూ 21 సీట్లతో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 15 చోట్ల విజయం సాధించింది. ఇక డీఎంకే రెండు సెగ్మెంట్లలో గెలుపొందింది. పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్, ఏఐఎన్‌ఆర్‌సీ మధ్య హోరాహోరీ పోరు కనిపించింది.

అయితే రానురానూ పరిస్థితి కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా మారిపోయింది. ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన అన్నాడీఎంకే నాలుగు సీట్లు గెలుపొందింది. గెలిచిన ప్రముఖుల్లో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వి. వైతిలింగం(కామరాజ్‌నగర్), పీసీసీ అధ్యక్షుడు ఎ.నమశ్శివాయ(విల్లియనూర్) ఉన్నారు. ఇక కాంగ్రెస్ అగ్రనేత ఇ.వల్సరాజ్ మహి నియోజకవర్గంలో స్వతంత్య్ర అభ్యర్థి వి.రామచంద్రన్ చేతిలో ఓటమిపాలయ్యారు.

కరైకల్ సౌత్ నియోజకవర్గంలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన డీఎంకే నాయకుడు ఏఎంహెచ్ నజీమ్ అన్నాడీఎంకే అభ్యర్థి కేఏయూ అసనా చేతిలో కేవలం 20 ఓట్ల తేడాతో ఓడిపోయారు. కాగా, బీజేపీతో పాటు పీడబ్ల్యూఏ, డీఎండీకే, ఎండీఎంకే, సీపీఎం, సీపీఐ, ఆర్‌ఎస్‌పీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయాయి.
 
రేసులో నమశ్శివాయ, వైతిలింగం
కాంగ్రెస్-డీఎంకే కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించడంతో సీఎం అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. నమశ్శివాయ, వైతిలింగం సీఎం పీఠం రేసులో ముందున్నారు.
 
వీఎంసీ ఫ్యామిలీ ఆధిపత్యానికి తెర
నెరవి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్నాడీఎంకేకు చెందిన వీఎంసీ శివకుమార్ కుటుంబం అధిపత్యానికి తెరపడింది. ఈ నియోజకవర్గంలో 1977 నుంచి జరిగిన తొమ్మిది ఎన్నికల్లో శివకుమార్ కుటుంబ సభ్యులే గెలుపొందుతూ వస్తున్నారు. అయితే తాజా ఎన్నికల్లో మాత్రం డీఎంకే అభ్యర్థి గీతా ఆనందన్ శివకుమార్ కుటుంబ ఆధిపత్యానికి చెక్ పెట్టారు. ఆమె 6,936 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత నెలలో గీత నామినేషన్ దాఖలు చేసిన రోజే ఆమె భర్త ఆనందన్ కన్నూమూశారు.
 
20 ఏళ్ల తర్వాత అసెంబ్లీలోకి మహిళలు
20 ఏళ్ల తరువాత పుదుచ్చేరి అసెంబ్లీలో మహిళలు అడుగుపెట్టబోతున్నారు. గురువారం వెలువడిన ఫలితాల్లో న లుగురు మహిళలు గెలుపొందారు. వి.విజయవాణి( కాంగ్రెస్), గీత(డీఎంకే), బి.కోబిక(ఎఐఎన్‌ఆర్సీ),చంద్రప్రియాంక(ఎఎన్‌ఐఆర్సీ)లు గెలుపొందిన 30 మంది సభ్యుల్లో ఉన్నారు. 1996లో ఎస్.అరసి(ఏఐఏడీఎంకే) తరువాత మరే మహిళా ఎన్నికవలేదు.
 
యూనాం ఎమ్మెల్యేగా మల్లాడి విజయం

వరుసగా ఐదోసారి గెలుపు

తాళ్లరేవు : పుదుచ్చేరి పరిధిలోని యానాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మల్లాడి కృష్ణారావు గెలిచారు. యూనాం నుంచి ఎమ్మెల్యేగా గెలవడం ఇది వరుసగా ఐదోసారి.  పుదుచ్చేరి ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమికి ఆధిక్యం దక్కడంతోమల్లాడి మరోసారి మంత్రి పదవిని చేపట్టే అవకాశాలు ఉన్నాయి. మల్లాడికి 20,801 ఓట్లు, ఎన్‌ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి, రిటైర్డ్ ఎస్పీ తిరుకోటి భైరవస్వామికి 12,047 ఓట్లు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement