
ఇక కుయ్.. కుయ్.. మోతలు వద్దు
పుదుచ్చేరి: మాజీ ఐపీఎస్ అధికారిణి, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పాలనలో తన మార్క్ చూపుతున్నారు. రౌడీయిజం చేస్తే తాట తీస్తానంటూ ఇటీవల వార్నింగ్ ఇచ్చిన కిరణ్ బేడీ.. కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఐపీల కార్లకు, వారి ఎస్కార్ట్, పైలట్ వాహానాలకు సైరన్లు వాడకంపై నిషేధం విధించారు. లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటరీ దేవా నిధి ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.
అంతేగాక వీఐపీల వాహానాలకు ఎలాంటి మినహాయింపు ఇవ్వరాదంటూ ట్రాఫిక్ పోలీసులకు కిరణ్ బేడీ ఆదేశాలు జారీ చేశారు. వీఐపీల కోసం ట్రాఫిక్ను ఆపరాదని, ప్రజలకు అసౌకర్యం కలిగించరాదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందేనని ఆదేశించారు. కాగా వాహానాలకు సైరన్లు వాడకం విషయంలో అంబులెన్స్లు, ఫైర్ సర్వీసులు వంటి అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇచ్చారు.