పుణె: చాయ్ అమ్ముతూ నెలకు ఎంత సంపాదించొచ్చు? వ్యాపారం బాగా జరిగినా రోజుకు వెయ్యి రూపాయలు ఆదాయం పొందడం గగనం. అలాంటిది పుణెలో ఓ వ్యక్తి మాత్రం చాయ్ అమ్మి ఏకంగా నెలకు రూ. 12 లక్షలు ఆర్జిస్తున్నాడు. అతనే నవ్‌నాథ్ యేవలే. పుణెలో టీకి మంచి డిమాండ్ ఉన్నప్పటికీ ప్రఖ్యాత టీ బ్రాండ్లు, ఔట్‌లెట్‌లు ఏవీ లేవని 2011లో యేవలే గుర్తించారు. ఆ తర్వాత తాను ఆ వ్యాపారం చేయాలని నిర్ణయించుకుని తన టీ రుచి ఎలా ఉండాలనే దానిపై నాలుగేళ్లు పరిశోధనలు చేశారు. అనంతరం మరికొందరిని భాగస్వాములుగా చేర్చుకుని తన పేరుమీదనే చాయ్ దుకాణం తెరిచారు.
కొద్దిరోజుల్లోనే ఆయన టీకి భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో పుణెలోనే మరో రెండు చోట్ల యేవలే ఔట్‌లెట్‌లను తెరిచారు. ఇప్పుడు ఒక్కో ఔట్‌లెట్‌లో 12 మందికి ఆయన ఉపాధి కల్పిస్తున్నారు. రోజుకు దాదాపు 4 వేల కప్పుల చాయ్ అమ్ముడుపోతోంది. త్వరలోనే యేవలే టీ స్టాల్‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్తాననీ, మరో వంద టీ స్టాల్స్ ఏర్పాటు చేసి మరింత మందికి ఉద్యోగాలిస్తానని ఆయన చెబుతున్నారు. పకోడీలు అమ్ముకోవడం కూడా ఉద్యోగమేనని ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించడంతో దానిపై తీవ్ర చర్చ జరగడం తెలిసిందే. ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ‘పకోడా వ్యాపారంలా కాకుండా మేం చాయ్ అమ్మి ఉపాధి కూడా కల్పిస్తున్నాం’ అని నవ్‌నాథ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment