చండీగఢ్ : పెళ్లి వేడుకల్లో భాగంగా నిర్వహించిన బరాత్ వేడుకలో అపశృతి చోటు చేసుకుంది. దాంతో పెళ్లి కుమారుడితో సహా మరో 14 మంది మురికి కాల్వలో పడిపోయారు. పంజాబ్‌లోని హోషియాపూర్ గ్రామంలో ఫిబ్రవరి 9న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఘజియాబాద్‌లోని ఇందిరాపురముకు చెందిన అమిత్ యాదవ్‌కు సోనమ్ అనే యువతితో పెళ్లి కుదిరింది. ఈ క్రమంలో హోషియాపూర్‌లో ఏర్పాటు చేసిన వివాహ వేదిక వద్దకు ఇరు కుటుంబాల బంధువులు వచ్చారు. అయితే ఫంక్షన్ హాల్‌కు రోడ్డుకు మధ్య చిన్నపాటి మురుగు కాల్వ ఉంది. పెళ్లికి వచ్చే వారికి వీలుగా ఈ మురుగు కాల్వపై తాత్కాలిక బ్రిడ్జిని ఏర్పాటు చేశారు.
ఫంక్షన్ హాల్ ముందు వధువు కుటుంబ సభ్యులు వరుడికి ఆహ్వానం పలికేందుకు నిలబడ్డారు. అదే సమయంలో వరుడితో పాటు ఆయన స్నేహితులు డ్యాన్స్ చేసుకుంటూ తాత్కాలిక బ్రిడ్జిని దాటుతున్నారు. ఈ సమయంలో బ్రిడ్జి ఉన్నట్టుంది కుప్పకూలిపోయింది. దాంతో వరుడితో సహా మరో 14 మంది మురుగు కాల్వలో పడిపోయారు. వీరిలో ఇద్దరు ఎనిమిదేళ్ల పిల్లలు కూడా ఉన్నారు. బాధితులందరిని చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు ఫంక్షన్ హాల్ యాజమాన్యమే బాధ్యత వహించాలని వరుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. దాంతో ఫంక్షన్ హాల్ యాజమాన్యం వరుడి కుటుంబానికి రూ. 3 లక్షల పరిహారం ఇస్తామని చెప్పడంతో.. వివాదం సద్దుమణిగింది.
Comments
Please login to add a commentAdd a comment