చంఢీగర్ : పంజాబ్ ప్రభుత్వం దాదాపు 80 కోట్ల రూపాయలు వెచ్చించి 400 లక్జరి కార్లను కొంటున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి, అతని మంత్రి వర్గం, అధికారుల కోసం ఈ లక్జరి కార్లను కొంటున్నట్లు సమాచారం. ఇప్పటికే 16 ల్యాండ్ క్రూయిజర్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ 16 వాహనాల్లో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా ఉన్నాయి. వీటిని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ కోసం వినియోగించనున్నట్లు సమాచారం.
అలానే ముఖ్యమంత్రి అధికారుల కోసం 13 మహీంద్ర స్కార్పియో వాహనాలను, స్పెషల్ డ్యూటీ అధికారుల కోసం 14 హోండా మారుతీ కార్లను కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌కు, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌లకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఇచ్చేందుకు అమరేందర్ సింగ్ ప్రభుత్వం నిరాకరించింది. అంతేకాక మాజీ ముఖ్యమంత్రి, అకాలీదళ్ అధ్యక్షులు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలనే వాడుతున్నారని.. అవి మంచి స్థితిలోనే ఉన్నాయని పంజాబ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ వెల్లడించారు.
ఈ కొత్త వాహనాల కొనుగోలు వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 80 కోట్ల అదనపు భారం పడుతున్నట్లు ఆర్థిక శాఖ అంచనా వేసింది. 2018, మార్చి నాటికే ప్రభుత్వ ఖజానా రు. 1,95,978 కోట్ల లోటు బడ్జెట్‌లో ఉన్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment