land cruiser
-
టయోటా లగ్జరీ కారు సొంతం చేసుకున్న ఫస్ట్ సెలబ్రిటీ: ధర తెలిస్తే!
సాక్షి, ముంబై: ఖరీదైన వాహనాలను కొనాలని అందరికి ఉంటుంది. కానీ అది చాలా వరకు పారిశ్రామిక వేత్తలకు, సెలబ్రటీలకు మాత్రమే సాధ్యమవుతుంది. ఇటీవల పంజాబీ సింగర్ 'గురుదాస్ మాన్' టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC300 సొంతం చేసుకున్నారు. ఇటీవల జరిగిన 2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన ల్యాండ్ క్రూయిజర్ ఎల్సి300 ధర రూ. 2.1 కోట్లు. ఇది వైట్ పెర్ల్, సూపర్ వైట్, డార్క్ రెడ్ మైకా మెటాలిక్, ఆల్టిట్యూడ్ బ్లాక్, డార్క్ బ్లూ మైకా కలర్ ఆప్సన్స్‌లో లభిస్తుంది. ఇందులో గురుదాస్ మాన్ ఆల్టిట్యూడ్ బ్లాక్ కలర్ కారుని డెలివరీ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే కంపెనీ ల్యాండ్ క్రూయిజర్ ఎల్సి300 కోసం రూ. 10 లక్షల టోకెన్‌తో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభమైన అతి తక్కువ కాలంలోనే మొత్తం అమ్ముడైపోవడం గమనార్హం. ఇది 3.3-లీటర్, టర్బోచార్జ్డ్, V6 డీజిల్ ఇంజిన్ కలిగి 309 పిఎస్ పవర్ & 700 ఎన్ఎమ్ టార్క్ అందిస్తూ 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. ఫీచర్స్ విషయానికి వస్తే, ల్యాండ్ క్రూయిజర్ LC300లో 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్, 14-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ సీట్లు, సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే వంటివి ఉన్నాయి. గురుదాస్ మాన్ పంజాబ్‌కు చెందిన సింగర్, రచయిత కూడా. ఇతడు 1980లో దిల్ దా మామ్లా హై అనే పాటతో ఒక్కసారిగా పేమస్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు తన పాటలతో అందరినీ ఆకట్టుకుంటూ 2013 లో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారు. ల్యాండ్ క్రూయిజర్ డెలివరీ సమయంలో కూడా పంజాబీ పాటతో అలరించాడు. -
సీఎం కోసం రూ.80 కోట్లతో కొత్త వాహనాలు
చంఢీగర్ : పంజాబ్ ప్రభుత్వం దాదాపు 80 కోట్ల రూపాయలు వెచ్చించి 400 లక్జరి కార్లను కొంటున్నట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న సమయంలో ఇంత భారీ మొత్తం ఖర్చు చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి, అతని మంత్రి వర్గం, అధికారుల కోసం ఈ లక్జరి కార్లను కొంటున్నట్లు సమాచారం. ఇప్పటికే 16 ల్యాండ్ క్రూయిజర్ల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ 16 వాహనాల్లో రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కూడా ఉన్నాయి. వీటిని పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేందర్ సింగ్ కోసం వినియోగించనున్నట్లు సమాచారం. అలానే ముఖ్యమంత్రి అధికారుల కోసం 13 మహీంద్ర స్కార్పియో వాహనాలను, స్పెషల్ డ్యూటీ అధికారుల కోసం 14 హోండా మారుతీ కార్లను కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్‌కు, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌లకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఇచ్చేందుకు అమరేందర్ సింగ్ ప్రభుత్వం నిరాకరించింది. అంతేకాక మాజీ ముఖ్యమంత్రి, అకాలీదళ్ అధ్యక్షులు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలనే వాడుతున్నారని.. అవి మంచి స్థితిలోనే ఉన్నాయని పంజాబ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మన్‌ప్రీత్ సింగ్ బాదల్ వెల్లడించారు. ఈ కొత్త వాహనాల కొనుగోలు వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ. 80 కోట్ల అదనపు భారం పడుతున్నట్లు ఆర్థిక శాఖ అంచనా వేసింది. 2018, మార్చి నాటికే ప్రభుత్వ ఖజానా రు. 1,95,978 కోట్ల లోటు బడ్జెట్లో ఉన్నట్లు తెలిసింది. -
రెండేళ్ల తర్వాత కారు తిరిగిచ్చేస్తా...
నిరాణి అందజేసిన లగ్జరీ కార్‌పై యడ్యూరప్ప వ్యాఖ్య బెంగళూరు: మాజీ మంత్రి మురుగేష్ నిరాణి తనకు అందజేసిన రూ.1.16 కోట్ల విలువైన లగ్జరీ కారును రెండేళ్ల తర్వాత ఆయనకే తిరిగి ఇచ్చేస్తానని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప వెల్లడించారు. శనివారమిక్కడి డాలర్స్ కాలనీలో ఉన్న తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరాణి తనకు బహుమానంగా ఇచ్చిన కారును కరువు ప్రాంతాల పర్యటన పూర్తి చేయడంతో పాటు రెండేళ్ల తర్వాత తిరిగి ఇచ్చేస్తానని తెలిపారు. కరువు పర్యటన సమయంలో ఈ కారును కేవలం జిల్లా కేంద్రాల వరకు మాత్రమే పరిమితం చేస్తానని, గ్రామాలకు వేరే వాహనంలో వెళతానని యడ్యూరప్ప తెలిపారు. కారు ఖరీదును రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులతో పోల్చి వివాదాస్పదం చేయడం సరికాదని అన్నారు. ఈనెల 29 నుంచి తాను కరువు పర్యటనను ప్రారంభించనున్నానని వెల్లడించారు. ఇక ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేపట్టిన కరువు పర్యటనపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలకు భయపడి కరువు పర్యటనను సీఎం సిద్ధరామయ్య చేపట్టారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల కంటే మంత్రి వర్గ విస్తరణపైనే ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తోందని మండిపడ్డారు. -
పాక్ క్రికెట్ కెప్టెన్ కారు సీజ్
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు అత్యధిక కాలం కెప్టెన్ గా కొనసాగుతున్న మిస్బా-వుల్-హక్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. అతడి కారుని అధికారులు సీజ్ చేశారు. కస్టమ్స్ డ్యూటీ, పన్నులు చెల్లించకపోవడంతో మిస్బాకు చెందిన ల్యాండ్ క్రూయిజర్ కారును ఫెడరల్ బోర్డు ఆఫ్ రెవెన్యూ అండ్ టాక్సేషన్(ఎఫ్ బీఆర్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెనాల్టీతో సహా పన్నులు చెల్లించిన తర్వాతే కారు తిరిగిస్తామని అధికారులు నోటీసు ఇచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు రూ.40 లక్షలు పన్ను బకాయిలు కట్టనందుకు అతడి బ్యాంకు ఖాతాను గతేడాది ఎఫ్ బీఆర్ అధికారులు నిలిపివేశారు. తర్వాత ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ను కలిసి ఈ సమస్యను మిస్బా పరిష్కరించుకున్నాడు. శ్రీలంకతో జరగనున్న మూడు టెస్టుల కోసం మిస్బా సిద్ధమవుతున్నాడు.