పాక్ క్రికెట్ కెప్టెన్ కారు సీజ్
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు అత్యధిక కాలం కెప్టెన్ గా కొనసాగుతున్న మిస్బా-వుల్-హక్ ను కష్టాలు వెంటాడుతున్నాయి. అతడి కారుని అధికారులు సీజ్ చేశారు. కస్టమ్స్ డ్యూటీ, పన్నులు చెల్లించకపోవడంతో మిస్బాకు చెందిన ల్యాండ్ క్రూయిజర్ కారును ఫెడరల్ బోర్డు ఆఫ్ రెవెన్యూ అండ్ టాక్సేషన్(ఎఫ్ బీఆర్) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెనాల్టీతో సహా పన్నులు చెల్లించిన తర్వాతే కారు తిరిగిస్తామని అధికారులు నోటీసు ఇచ్చినట్టు తెలుస్తోంది.
దాదాపు రూ.40 లక్షలు పన్ను బకాయిలు కట్టనందుకు అతడి బ్యాంకు ఖాతాను గతేడాది ఎఫ్ బీఆర్ అధికారులు నిలిపివేశారు. తర్వాత ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ ను కలిసి ఈ సమస్యను మిస్బా పరిష్కరించుకున్నాడు. శ్రీలంకతో జరగనున్న మూడు టెస్టుల కోసం మిస్బా సిద్ధమవుతున్నాడు.