రెండేళ్ల తర్వాత కారు తిరిగిచ్చేస్తా...
నిరాణి అందజేసిన లగ్జరీ కార్‌పై యడ్యూరప్ప వ్యాఖ్య
బెంగళూరు: మాజీ మంత్రి మురుగేష్ నిరాణి తనకు అందజేసిన రూ.1.16 కోట్ల విలువైన లగ్జరీ కారును రెండేళ్ల తర్వాత ఆయనకే తిరిగి ఇచ్చేస్తానని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బి.ఎస్.యడ్యూరప్ప వెల్లడించారు. శనివారమిక్కడి డాలర్స్ కాలనీలో ఉన్న తన నివాసంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిరాణి తనకు బహుమానంగా ఇచ్చిన కారును కరువు ప్రాంతాల పర్యటన పూర్తి చేయడంతో పాటు రెండేళ్ల తర్వాత తిరిగి ఇచ్చేస్తానని తెలిపారు.
కరువు పర్యటన సమయంలో ఈ కారును కేవలం జిల్లా కేంద్రాల వరకు మాత్రమే పరిమితం చేస్తానని, గ్రామాలకు వేరే వాహనంలో వెళతానని యడ్యూరప్ప తెలిపారు. కారు ఖరీదును రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులతో పోల్చి వివాదాస్పదం చేయడం సరికాదని అన్నారు. ఈనెల 29 నుంచి తాను కరువు పర్యటనను ప్రారంభించనున్నానని వెల్లడించారు.
ఇక ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేపట్టిన కరువు పర్యటనపై ఆయన విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షాలకు భయపడి కరువు పర్యటనను సీఎం సిద్ధరామయ్య చేపట్టారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యల కంటే మంత్రి వర్గ విస్తరణపైనే ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తోందని మండిపడ్డారు.