నాడు ఉగ్రవాదం.. నేడు డ్రగ్స్! | punjabi youth victimised to millitancy then and to drugs now | Sakshi
Sakshi News home page

నాడు ఉగ్రవాదం.. నేడు డ్రగ్స్!

Published Tue, Jun 14 2016 6:26 PM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

నాడు ఉగ్రవాదం.. నేడు డ్రగ్స్! - Sakshi

నాడు ఉగ్రవాదం.. నేడు డ్రగ్స్!

పంజాబ్‌లో బలైపోతున్న యువతరం
చిన్నాభిన్నం అవుతున్న కుటుంబాలు

చండీగఢ్

పంజాబ్ రాష్ట్రంలో ఓ తరం ఉగ్రవాదానికి బలైపోయింది. ఇప్పుడు మరో తరం డ్రగ్స్‌ మహమ్మారికి బలైపోతోంది. అప్పుడు ఉగ్రవాదం మిగిల్చిన గర్భశోకం కన్నా ఇప్పుడు డ్రగ్స్‌కు బానిసైన తరం ఎక్కువ శోకాన్నే మిగులుస్తోంది. కుటుంబాలకు కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. ఓ తండ్రి, ఓ తనయుడు, ఓ మామ, ఓ అల్లుడు, ఓ అన్నా, ఓ తమ్ముడు మాదకద్రవ్యాలకు అలవాటుపడి రోడ్డున పడుతుంటే తల్లీ కూతురు, అక్కా చెల్లి, అత్తా కోడలు రోడ్డున పడి కాయకష్టం చేసి కుటుంబాలను పోషించాల్సిన దుర్భర పరిస్థితులు దాపురించాయి.

పంజాబీ యువత నేడు ఒకరకమైన సమష్టి మానసిక ఒత్తిడికి గురై డ్రగ్స్‌కు బానిసవుతోంది.  హెరాయిన్, చరస్, స్మాక్, నల్లమందు, ఇతర ఉత్ప్రేరకాలతో పాటు దేశీయ మద్యం మత్తులో తూలిపోతోంది. పెయిన్ కిల్లర్లను కూడా మత్తు కోసం వాడుతోంది. చేతిలో చిల్లిగవ్వ లేనప్పుడు మత్తు కోసం గోడమీద పాకే బల్లుల తోకలను నమిలి మింగుతున్నారు. యువతకు ఎందుకింత మానసిక ఒత్తిడి? డ్రగ్స్‌కు ఎందుకు బానిసలు అవుతున్నారు.. వెనకబాటుతనం, నిరుద్యోగం పెరిగి పోవడం, తరతరాల దళిత సిక్కుల అణచివేత, వ్యవసాయంలో అధికంగా ఉపయోగిస్తున్న రసాయనిక ఎరువుల ప్రభావం, డ్రగ్స్ మాఫియాల జోరు, పోలీసుల నిర్లిప్తత, ప్రభుత్వం అవినీతి వెరసి ప్రస్తుత దుస్థితికి కారణం.

భారతదేశంలోనే డ్రగ్స్ బానిసలు ఉన్న ప్రాంతంలో పంజాబ్ రెండోస్థానం ఆక్రమించిందని ఐక్యరాజ్య సమితి ఇటీవల ఓ నివేదికలో వెల్లడించింది కానీ మొదటి ప్రాంతం ఇదే కావచ్చేమోనని అనధికార లెక్కలు సూచిస్తున్నాయి. రాష్ర్టంలోని గ్రామీణ ప్రాంతాల్లో మూడోవంతు డ్రగ్స్ మత్తులో పడిందని సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే ఇటీవల రాష్ట్ర హైకోర్టు ముందు అంగీకరించింది. పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల్లో యువకులు నిర్లక్ష్యంగా డ్రగ్స్ ఇంజెక్షన్లను షేర్ చేసుకుంటున్నారు. ఒకరు రోజుకు వంద చొప్పున డ్రగ్ మాత్రలు మింగుతున్నారు. అందుకోసం అప్పులు చేస్తున్నారు. దొంగతనాలకు పాల్పడుతున్నారు. కుటుంబసభ్యులపై దాడులు చేస్తున్నారు. తండ్రిని చూసి కొడుకు, అన్నను చూసి తమ్ముడు మత్తులో పడిపోతున్నారు.


అలాంటి కుటుంబాల్లో ఇంటి పోషణ భారం కావడంతో పిల్లలు చదువు మానేస్తున్నారు. చిన్నా చితకా పనులు చేస్తున్నారు. డబ్బు కోసం దేశీయ మద్యం అమ్ముతున్నారు. కొందర డ్రగ్స్ చేరవేత చైన్లో చేరి పోతున్నారు. ఫలితంగా విషవలయానికి పరోక్షంగా సహకరిస్తున్నారు. రాష్ట్రంలోని 51 పునరావాస కేంద్రాల్లో ఐదువేల మందికి పైగా యువకులు యాంటీ డ్రగ్స్ చికిత్సలు పొందుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వీరికి చికిత్స చేసేందుకు ప్రైవేటు పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటయ్యాయి. అయితే డబ్బు దండుకోవడమే పనిగా పెట్టుకోవడంతో వాటిలో సరైన శిక్షకులు పనిచేయడం లేదు. రోగులను కొడుతున్నారు. హింసిస్తున్నారు.

అమృత్‌సర్‌కు సమీపంలో ఉన్న మక్బూల్‌పురా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ గ్రామంలో ప్రతి రెండో ఇంటిలో ఒకరు డ్రగ్స్ కారణంగా మరణించినవారే. ఈ గ్రామాన్ని వితంతువుల గ్రామమని పిలుస్తారు. 350 మంది వ్యక్తులు డ్రగ్స్ కారణంగానే మరణించారు. 1999లో 30 మంది మహిళలు డ్రగ్స్ కారణంగా వితంతువులు అయ్యారంటూ ట్రిబ్యూన్ పత్రిక ఓ వ్యాసాన్ని ప్రచురించింది. అప్పుడు 'వితంతువుల గ్రామం' అని శీర్షిక పెట్టడంతో అదే పేరు శాశ్వతమైంది. ఈ గ్రామంలో ప్రతి వీధి చివర దేశీయ మద్యాన్ని ఆడ పిల్లలు విక్రయిస్తుంటారు. గ్రామంలోని ఓ మహిళ డ్రగ్స్ వల్ల మొదటి భర్త మరణించడంతో రెండోపెళ్లి చేసుకుంది. రెండో భర్త కూడా డ్రగ్స్‌కు అలవాటై మరణించాడు. మూడో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మూడో భర్త కూడా డ్రగ్స్‌కు బానిసయ్యాడని తెలిసినా ఏం చేయలేకపోతోంది. ఒకప్పుడు బాగా బతికిన ఆమె ప్రస్తుతం పాచిపని చేసుకొని బతుకుతోంది. కూతురు తల్లికి తోడుగా వెళుతోంది. ఇంతటి దారుణ పరిస్థితులున్న ఈ గ్రామాన్ని మాఫీయాలిచ్చే మనీకి అలావాటు పడిపోయి అధికారులు గానీ, పోలీసులు గానీ పట్టించుకోవడం లేదు.

స్థానికంగా మాస్టర్‌జీ అని పిలిచే ప్రభుత్వ టీచర్ అజీత్ సింగ్, టీచరైన ఆయన భార్య అమన్‌దీప్ ఈ  గ్రామాన్ని పట్టించుకుంటున్నారు. రేపటి తరాన్నైనా డ్రగ్స్ బానిసలు కాకుండా మార్చాలన్న ఉద్దేశంతో పాఠశాల అనంతరం ఇంట్లో పిల్లలు ఉచితంగా పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. మూడు గదులున్న ఇంటిని పాఠశాలగానే మార్చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఎలా పోరాడాలో పిల్లలకు నేర్పుతున్నారు. వారి కృషికి మెచ్చి ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చాయి. దాంతో ప్రభుత్వ పాఠశాలకు సమాంతరంగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ఓ పాఠశాలనే నడుపుతున్నారు. ఆ పాఠశాలలో ఇప్పుడు 400 మంది విద్యార్థులు ఉన్నారు. వారు వేసవి సెలవుల్లో ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లి డ్రగ్స్ వ్యతిరేకంగా ప్రదర్శలు జరుపుతున్నారు.

ముందుతరం ఉగ్రవాదానికి బలైపోగా, రెండో తరం డ్రగ్స్‌కు బలవుతుండగా, మూడో తరం మీదనే ప్రస్తుతం పంజాబ్ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.

(పంజాబ్‌లో తీవ్రమైన డ్రగ్స్ సమస్యను ఇతివృత్తంగా తీసుకొని నిర్మించిన 'ఉడ్తా పంజాబ్' బాలీవుడ్ సినిమా త్వరలో విడుదలవుతున్న విషయం తెల్సిందే.)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement