ఘనంగా జగన్నాథ రథయాత్ర
భువనేశ్వర్(పూరీ): ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్ర ఆదివారం వైభవంగా ప్రారంభమైంది. ఈ యేడు ఆలయ ప్రధాన మందిరం నుంచి మూలవిరాట్ల తరలింపు(పొహండి)లో జాప్యం వల్ల యాత్ర గంట ఆలస్యంగా మొదలైంది. ఓవైపు వర్షం కురుస్తున్నప్పటికీ లక్షలాది మంది భక్తులు రథయాత్రలో పాల్గొన్నారు. సుదర్శనుడు, సుభ ద్ర, బలభద్రుడు, శ్రీజగన్నాథుని విగ్రహాలు వరుస క్రమంలో రథాలపైకి చేరాయి. పూరీ మహారాజు దివ్యసింఘ్‌దేవ్ బంగారు చీపురుతో మూడు రథాల్ని శుద్ధి చేసి చందనపుష్పాలతో పూజలు నిర్వహించారు.
తర్వాత స్థానిక గోవర్ధన పీఠాధిపతి శంకరాచార్యులు స్వామి నిశ్చలానంద సరస్వతి రథాలపై దేవదేవుళ్లని దర్శించుకున్నారు. అనంతరం రథాలపై సంప్రదాయ పూజలు ముగించి సీఎం నవీన్ పట్నాయక్ సహా భక్తజనం రథాలను లాగారు. తొలుత బలభద్రుని రథం ‘తాళధ్వజం’ కదిలింది. ఆ తర్వాత దేవీ సుభద్ర రథం ‘దర్పదళనం’ కదలగా, చివరగా జగన్నాథుని ‘నందిఘోష్’ రథం కదిలింది. పెద్ద సంఖ్యలో విదేశీయులు కూడా 3 రథాలను లాగారు. ఉగ్రవాదులు దాడి చేసే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో యాత్రకు మూడంచెల గట్టి భద్రత కల్పించారు.