లాలూ ప్రసాద్ యాదవ్ ని కలిసిన రాబ్రీదేవి!
పశుగ్రాస కుంభకోణంలో కోర్టు దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో రాంచీ జైల్లో ఉన్న ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ను ఆయన సతీమణి బీహార్ మాజీ ముఖ్యమంత్రి రాబ్రీ దేవి బుధవారం సాయంత్రం కలుసుకున్నారు. ఈ కేసులో ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ప్రవాస్ కుమార్ సింగ్ గురువారం శిక్ష ఖారారు చేయనున్న సంగతి తెలిసిందే.
రాంచీ జైల్లో ఉన్న లాలూని కలుసుకోవడానికి ముందు రాబ్రీదేవి.. ఆర్జేడీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో భవిష్యత్ కార్యచరణను, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించారు. ఈ సమావేశంలో లాలూ ప్రసాద్ స్థానంలో రాబ్రీదేవి పార్టీకి నాయకత్వం వహించాలని ఆ పార్టీ నాయకుడు రాం కృపాల్ యాదవ్ కోరారు.
జైల్లో ఉన్న లాలూ సూచనల ప్రకారం పార్టీని పటిష్టం చేద్దామని మరో నేత తెలిపారు. చైబాసా జిల్లా ట్రెజరీ నుంచి 37.70 కోట్ల రూపాయలను అక్రమంగా విత్ డ్రా చేశారనే ఆరోపణపై లాలూపై గురువారం శిక్ష ఖరారు అయ్యే అవకాశం ఉంది.