Ranchi jail
-
క్షీణిస్తున్న లాలూ ఆరోగ్యం
రాంచీ: రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్(72) ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండటంతో శనివారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. దాణా కుంభకోణం కేసులో రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూ వివిధ ఆరోగ్య సమస్యలతో రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్)లో చికిత్స పొందుతున్నారు. ‘ఆయనకు న్యుమోనియా సోకింది. మెరుగైన చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించాలని నిర్ణయించాం. ఎయిమ్స్ నిపుణులను ఇప్పటికే సంప్రదించాం. 8 మంది సభ్యులతో కూడిన కమిటీ నుంచి నివేదిక అందిన వెంటనే ఢిల్లీకి తీసుకెళ్తాం’ అని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ కామేశ్వర్ ప్రసాద్ శనివారం సాయంత్రం తెలిపారు. అధికారులు, లాలూ కుటుంబసభ్యులు ఢిల్లీకి తరలించేందుకు ప్రత్యేకంగా ఎయిర్ అంబులెన్సును ఏర్పాటు చేశారని కూడా ఆయన వెల్లడించారు. లాలూను ఢిల్లీకి తరలించేందుకు రాంచీ జైలు అధికారులు సీబీఐ కోర్టు అనుమతి తీసుకున్నారు. లాలూ ఆరోగ్యం క్షీణిస్తోందని తెలిసిన భార్య రబ్రీదేవి, కూతురు మిసా భారతి, కుమారులు తేజ్ ప్రతాప్, తేజస్వి శుక్రవారం రాత్రి ఆయనను కలుసుకున్నారు. అనంతరం తేజస్వీ యాదవ్ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో భేటీ అయి, తమ తండ్రికి మెరుగైన వైద్యం అందించేందుకు సాయం అర్థించారు. రిమ్స్‌లో ఉండగా లాలూ జైలు నిబంధనలను అతిక్రమించారన్న కేసుపై జార్ఖండ్ హైకోర్టు విచారణ జరిపింది. ఈ విషయంలో ఆస్పత్రి యంత్రాంగం, జైలు అధికారులు వ్యవహరించిన తీరును తప్పుబట్టింది. -
లాలూకు పెరోల్
పట్నా : తన కుమారుడు తేజ్ ప్రతాప్, ఐశ్వర్యల వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆర్జేడీ సుప్రీం లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఐదురోజుల పెరోల్ మంజూరైంది. పశుగ్రాస కుంభకోణం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ తన కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు మే 9 నుంచి 13 వరకూ పెరోల్ కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. రాంచీ ఎస్పీ, జార్ఖండ్ అడ్వకేట్ జనరల్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వడంతో లాలూకు పెరోల్ మంజూరైంది. పెరోల్‌పై నిర్ణయం తీసుకునేందుకు జైలు అధికారులు అడ్వకేట్ జనరల్ సలహాను పరిగణనలోకి తీసుకున్నారు. లాలూకు ఇప్పటికే రాంచీకి చెందిన రిమ్స్ ఫిట్నెస్ ధృవీకరణ పత్రం ఇచ్చింది. బుధవారం సాయంత్రం లాలూ రాంచీ నుంచి పట్నాకు బయలుదేరి వెళతారని ఆర్జేడీ నేత భోలా యాదవ్ తెలిపారు. లాలూ కుమారుడు తేజ్ ప్రతాప్, బీహార్ మాజీ సీఎం దుర్గా ప్రసాద్ రాయ్‌ల మనవరాలు ఐశ్వర్యాల వివాహ నిశ్చితార్థం ఏప్రిల్ 18న పట్నాలోని హోటల్ మౌర్యలో అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఐశ్వర్యా మెహందీ వేడుక మే 12న కుటంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరగనుంది. -
రాంచీ జైల్లో లాలూ భద్రతకు ముప్పు
దాణా కుంభకోణంలో రాంచీలో జైలు శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ భద్రతకు ముప్పు పొంచివుందని జార్ఖండ్ పోలీసులు హెచ్చరించారు. లాలూ భద్రతపై జార్ఖండ్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆ రాష్ట్ర జైళ్ల శాఖను అప్రమత్తం చేశారు. లాలూ ఉన్న జైల్లోనే మావోయిస్టులు ఉండటం, అత్యున్నత స్థాయి వ్యక్తులు ఆయనను కలిసేందుకు జైలుకు వస్తుండటంతో భద్రతాపరమైన ముప్పు ఏర్పడవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదేళ్లు జైలు శిక్షపడ్డ లాలూను రాంచీలో ఉంచిన సంగతి తెలిసిందే. ఆయనను వీఐపీ ఖైదీలా పరిగణించి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. ప్రత్యేక బెడ్రూమ్, దోమతెర, మంచం, టీవీ సెట్, వార్తా పత్రికలు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. -
లాలూ ప్రసాద్ యాదవ్ ని కలిసిన రాబ్రీదేవి!
పశుగ్రాస కుంభకోణంలో కోర్టు దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో రాంచీ జైల్లో ఉన్న ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ను ఆయన సతీమణి బీహార్ మాజీ ముఖ్యమంత్రి రాబ్రీ దేవి బుధవారం సాయంత్రం కలుసుకున్నారు. ఈ కేసులో ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ప్రవాస్ కుమార్ సింగ్ గురువారం శిక్ష ఖారారు చేయనున్న సంగతి తెలిసిందే. రాంచీ జైల్లో ఉన్న లాలూని కలుసుకోవడానికి ముందు రాబ్రీదేవి.. ఆర్జేడీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో భవిష్యత్ కార్యచరణను, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించారు. ఈ సమావేశంలో లాలూ ప్రసాద్ స్థానంలో రాబ్రీదేవి పార్టీకి నాయకత్వం వహించాలని ఆ పార్టీ నాయకుడు రాం కృపాల్ యాదవ్ కోరారు. జైల్లో ఉన్న లాలూ సూచనల ప్రకారం పార్టీని పటిష్టం చేద్దామని మరో నేత తెలిపారు. చైబాసా జిల్లా ట్రెజరీ నుంచి 37.70 కోట్ల రూపాయలను అక్రమంగా విత్ డ్రా చేశారనే ఆరోపణపై లాలూపై గురువారం శిక్ష ఖరారు అయ్యే అవకాశం ఉంది.